గులాంగిరీ చేసెటోళ్లకే టికెట్లు ఇస్తరా?..బీజేపీపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఫైర్​

గులాంగిరీ చేసెటోళ్లకే టికెట్లు ఇస్తరా?..బీజేపీపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఫైర్​

హైదరాబాద్, వెలుగు: గులాంగిరీ చేసేటోళ్లకే పార్టీ టికెట్లు ఇస్తరా?  అని బీజేపీ నాయకత్వాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.  హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గౌతంరావును ప్రకటించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాజాసింగ్​ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘బీజేపీ ఆఫీస్ లో మేకప్ మ్యాన్ టేబుల్ సాఫ్ చేసేవాళ్లకే పెద్ద పెద్ద పోస్టులు, పెద్ద పెద్ద టికెట్లు ఇస్తరా?’ అంటూ మండిపడ్డారు. ‘నీ మనిషా...  నా మనిషా... ఇంకెన్నేండ్లు ఈ తమాషా’ అని అన్నారు.

 తాను ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా సిటీలో శోభాయాత్ర నిర్వహిస్తానని, ఈ ఏడాది  గౌతంరావు ఆధ్వర్యంలో  అంబర్ పేట నుంచి మరో శోభయాత్ర చేయిస్తున్నారని పేర్కొన్నారు. తనకు పోటీగానే ఈ శోభాయాత్ర పెట్టిస్తున్నారని ఆరోపించారు. అందుకే గౌతంరావుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారని అన్నారు. తాను ప్రతి ఏటా నిర్వహించే శోభాయాత్రను నిర్వీర్యం చేసేందుకే మరో యాత్ర పెట్టిస్తున్నారని మండిపడ్డారు.

 ‘‘హిందువులందరూ ఒకటి కావాలని శ్రీరామనవమి శోభాయాత్ర తీస్తా.  తెలంగాణలో రామరాజ్యం రావాలి. ఆ ఉద్దేశంతోనే నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా  శ్రీరామనవమి శోభాయాత్ర తీస్తున్నా. నా శ్రీరామనవమి శోభయాత్రలో రామభక్తులు తక్కువ రావాలనే ఉద్దేశంతోనే అంబర్ పేట నుంచి గౌతంరావు ఆధ్వర్యంలో మరో శోభాయాత్ర తీస్తున్నారు. అందుకే గౌతమ్ రావుకు టికెట్ ఇచ్చారు.” అని  రాజాసింగ్ వ్యాఖ్యానించారు.