మునుగోడు, వెలుగు: కేసీఆర్‌ను గద్దె దించేదాకా పోరాటం చేస్తానని, ప్రాణం పోయినా వదిలిపెట్టనని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలు తన వెంట ఉన్నారని, వాళ్ల కోసమే ఉద్యమం మొదలుపెట్టానని చెప్పారు. గొల్ల కురుమ సోదరులను కేసీఆర్ ప్రభుత్వం మోసగించిందంటూ సోమవారం మునుగోడు చౌరస్తాలో గొల్ల కురుమలతో కలిసి ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘‘మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేశాడో ప్రజలందరికీ తెలుసు. ఒక్కరిని ఓడించడానికి వంద మందిని పంపించి డబ్బులు, ప్రలో భాలకు గురి చేసి, పోలీసులను అడ్డం పెట్టుకొని ఎంత అరాచకం చేసాడో జనం చూశారు. ఎప్పుడైతే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోరుబాట పట్టానో అప్పటి నుంచే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. మునుగోడులో నేను మొదలుపెట్టిన పోరుబాట.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను బొంద పెడుతుంది” అని చెప్పారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసిందని, తమ దగ్గర అవినీతి సొమ్ము లేదని, అయినా 87 వేల మంది తమకు ఓటేసి ధర్మం వైపు నిలబడ్డారని చెప్పారు.
హామీలను నిలబెట్టుకోకుంటే వెంటాడుతం
మునుగోడును దత్తత తీసుకున్నామని ఊరికే చెప్పడం కాదని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మంత్రి కేటీఆర్‌ను ఇక్కడ తిరగనివ్వబోమని రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. భూ నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తామని చెప్పారని, హామీలను నిలబెట్టుకోకుంటే వెంటాడి తరిమికొడతామన్నారు. నియోజకవర్గంలో దళితులందరికీ దళిత బంధు అమలు చేసేదాకా పోరు ఆగదన్నారు. తర్వాత పోలీసులు రాజగోపాల్, బీజేపీ లీడర్లను అరె స్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాజగోపాల్ రెడ్డిని విడుదల చేయాలని బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
రాజగోపాల్ రెడ్డి అరెస్టు అన్యాయం: సంజయ్
హైదరాబాద్, వెలుగు: గొల్ల కుర్మలకు అకౌంట్లలో ఫ్రీజ్ చేసిన డబ్బులను వెంటనే వారికి అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గొల్ల కుర్మల కోసం పోరాడితే అరెస్టు చేయడం అన్యాయమని ఆయన దుయ్యబట్టారు. ప్రజల కోసం పోరాడితే తప్పా అని బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. గొల్ల కుర్మల కోసం తెలంగాణ సర్కార్ డబ్బులను జమచేసి తిరిగి తీసుకోకుండా ఫ్రీజ్ చేసిందని ఫైరయ్యారు. వారికి చెల్లించాల్సిన డబ్బులు తక్షణమే అందించాలని, లేదంటే ఈ పోరాటం ఒక్క మునుగోడుతోనే ఆగిపోదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రజల పక్షాన కొట్లాడుతా
గొల్ల కురుమ సోదరులకు గొర్ల కోసం డబ్బులు ఇస్తున్నామని చెప్పి.. 7,600 మంది అకౌంట్లలో డబ్బులు వేసినట్టే వేసి అకౌంట్లను ఫ్రీజ్ చేశారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అకౌంట్లు ఎలా ఫ్రీజ్ చేస్తారని ప్రశ్నించారు. ఫ్రీజ్ చేసిన డబ్బును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడుదల చేయకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గొల్ల కురుమ సోదరులకు డబ్బులు వచ్చేంతవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.