- భువనగిరి ఎంపీ టికెట్బీసీలకు ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే ప్రతిపాదన
- తన భార్య పోటీ చేస్తే తనకు కేబినెట్‌లో ఛాన్స్ మిస్సవుతుందని సందేహం
- బీసీ అభ్యర్థుల రేసులో తెరపైకి నేతి విద్యాసాగర్, మధుయాష్కీగౌడ్
నల్గొండ, వెలుగు: భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్‌విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ జరిపిన సర్వేలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి భార్య లక్ష్మి, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్‌రెడ్డి పేర్లు ఫైనల్ లిస్ట్‌లో ఉన్నప్పటికీ.. రాజగోపాల్‌రెడ్డి మాత్రం బీసీలకు టికెట్ ఇస్తే బాగుటుందనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
ఇటీవల మునుగోడులో పర్యటించిన సందర్భంగా బీసీ క్యాండిడేట్ అయితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదనే అభిప్రాయాన్ని హైకమాండ్‌కు చెప్పినట్టు ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌ను ప్రకటించిన తెల్లారే రాజగోపాల్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ సైతం బూర నర్సయ్యగౌడ్‌ను అభ్యర్థిగా పక్రటించిన సంగతి తెలిసిందే. సామాజిక సమీకరణాల కోణంలో బీసీకి టికెట్ ఇస్తే ఈజీగా గెలువొచ్చిన వాదన ఉన్నప్పటికీ.. మరో కోణంపైనా చర్చ జరుగుతోంది.
పోటీకి రాజగోపాల్ రెడ్డి నిరాస్తకత
భువనగిరి అభ్యర్థి ఎంపిక విషయాన్ని పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. దీనికోసం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సునీల్ కనుగోలు సర్వే చేయగా.. కోమటిరెడ్డి లక్ష్మి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ఫైనల్ అయినట్లు తెలిసింది. అయితే ఎంపీ టికెట్‌కోసం కోమటిరెడ్డి లక్ష్మి అప్లై చేసుకోలేదు. రాజగోపాల్ రెడ్డి కూడా హైకమాండ్ వద్ద ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
కానీ హైకమాండ్ మాత్రం పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. భువనగిరి సెగ్మెంట్లో కోమటిరెడ్డి ఫ్యామిలీకి మంది ప్రజాదరణ ఉంది. అన్నదమ్ములిద్దరు ఇది వరకు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించినందున పార్టీ లక్ష్మి వైపు మొగ్గు చూపినట్టు సమాచారం. కానీ, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపైనే ఫోకస్ పెట్టారు. రాష్ట్ర కేబినెట్‌లో పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆయన చెబుతున్నారు. ఎంపీగా టికెట్ తీసుకుంటే కేబినెట్‌లో చోటు మిస్సయ్యే ఛాన్స్ఉండొచ్చని ఆయన సందేహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇద్దరు సీఎం రేవంత్ సన్నిహితులే..
నల్గొండ ఎంపీ క్యాండిడేట్ కుందూరు రఘువీర్ రెడ్డి, భువనగిరి టికెట్ఆశిస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితులు. ఇద్దరికీ పార్టీ అగ్రనేతల సపోర్ట్ ఉంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఒకరిద్దరు సీనియర్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కిరణ్ఎంపీగా ఎంట్రీ ఇస్తే భువనగిరి కాంగ్రెస్‌లో కొత్త నాయకత్వానికి భీజం పడినట్టేనని, అది తమకు ఇబ్బంది అవుతుందేమోనని వాళ్లు సందేహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 30 చివరి డెడ్‌లైన్..
ఈ నెల 27న కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ ఢిల్లీలో జరగనుంది. ఈ మీటింగ్‌లో భువనగిరి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికీ తేలకపోతే 30న ఫైనల్ సీఈసీ మీటింగ్ ఉందని చెబుతున్నారు. ఈ మీటింగ్‌లో దేశ వ్యాప్తంగా పెండింగ్‌లో పెట్టిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని సీనియర్లు అంటున్నారు. భువనగిరి సస్పెన్స్వీడాలంటే మరో నాలుగైదు రోజులు ఆగా ల్సిందే.
బీసీ అయితే క్యాండేట్ఎవరు..?
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కొద్దిరోజుల ముందు భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా పార్టీ అడిగి తీసుకుంది. రెడ్డి సామాజిక వర్గానికి టికెట్‌ఇవ్వకపోతే, ఆ ప్లేస్‌లో బీసీలకు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మెజార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయ పడినట్టు తెలిసింది. బీసీ క్యాండిడేట్ అయితే ఎవరిని నిలబెట్టాలన్నది పార్టీకి సవాల్‌గా మారింది. మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా మధుయాష్కీ గౌడ్ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ నుంచి ఒత్తిడి ఎక్కువైతే అప్పుడు ఆలోచన చేస్తాం తప్ప, కోమటిరెడ్డి ఫ్యామిలీకి పదవులు కొత్త కాదని చెబుతున్నారు.