మునుగోడు ఉపఎన్నిక తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది: రాజగోపాల్

నల్గొండ జిల్లా: కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టేందుకే పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటుప్పల్ లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో రాజగోపాల్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు బానిసలుగా మారారని ఆరోపించారు. మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలన్నారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేందుకు వెళ్తే అడ్డుకునేవారని మండిపడ్డారు. కేసీఆర్ దగ్గర ఆత్మగౌరవాన్ని చంపుకుని ఉండలేక.. ఈటల రాజేందర్, బూరనర్సయ్య గౌడ్ లు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

100 కోట్లు అనేది పెద్ద డ్రామా

ఒక్క ఎమ్మెల్యేను ఓడించేందుకు.. సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా మునుగోడులో మకాం వేశారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. డబ్బులు పెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. డబ్బుకంటే ప్రజాశక్తి గొప్పదని మునుగోడు ప్రజలు నిరూపిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ వచ్చింది బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసమని.. రాబోయే రోజుల్లో వారి కోసం కష్టపడి పనిచేస్తానని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బులు ఆశ చూపి కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నిందంటూ టీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇదంతా చూస్తే కేసీఆర్ కు మతి భ్రమించినట్లు కనిపిస్తుందన్నారు. అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారిని బీజేపీ ఎలా తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. 100 కోట్లు అనేది చాలా పెద్ద డ్రామా అని ఆయన కొట్టిపారేశారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈటల రాజేందర్, కూన శ్రీశైలం యాదవ్, బూర నర్సయ్య గౌడ్, బీసీ సంఘాల నేతలు, గౌడ్ సంఘాల నేతలు, గౌడ్ కులస్తులు పాల్గొన్నారు.