ప్రలోభాలు, బెదిరింపులతో టీఆర్ఎస్​ గెలిచింది: రాజగోపాల్ రెడ్డి

  • కౌరవ సైన్యంతో కొట్లాడిన ప్రలోభాలు, బెదిరింపులతో టీఆర్ఎస్​ గెలిచింది
  • మాదే నైతిక విజయం: రాజగోపాల్​రెడ్డి
  • అసెంబ్లీ మొత్తం దింపి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డరు
  • కారు గుర్తుకు ఓటేయకపోతే పింఛన్లు రావని బెదిరిచ్చిన్రు
  • పోలీసుల సాయంతో మమ్మల్ని అష్టదిగ్బంధం చేసిన్రు
  • అవినీతి సొమ్ముకు కమ్యూనిస్టులు అమ్ముడుపోయిన్రు
  • బీజేపీ ఓట్లు10వేల నుంచి 90వేల దాక చేరడం గొప్ప విషయం
  • నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్త

నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో నైతిక విజయం తమదేనని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు. ఎవరికీ అపాయింట్​మెంట్​ ఇవ్వకుండా ఫామ్​హౌస్​లో పడుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ను, మంత్రులను, మొత్తం శాసనసభను మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తెచ్చామని పేర్కొన్నారు. ప్రలోభాలు, బెదిరింపులతో టీఆర్​ఎస్​ అనైతికంగా, అధర్మంగా గెలిచిందని,  వాళ్లు అనుకుంటున్నట్లు ఇది నిజమైన విజయం కాదని ఆయన  అన్నారు. ‘‘ఏ రోజైతే ముఖ్యమంత్రి మునుగోడు నియోజకవర్గంలో గ్రామానికి ఒక మంత్రిని, ఎమ్మెల్యేలతో కూడిన కౌరవ సైన్యాన్ని దింపి, అధికార దుర్వినియోగం మొదలుపెట్టారో ఆ రోజే మునుగోడు ప్రజలు, నేను గెలిచాం. కౌరవసైన్యంతో పోరాడిన. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, కుటుంబ, నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది” అని రాజగోపాల్​ స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్​ గెలుపు ఖాయం కాగానే కౌంటింగ్​ సెంటర్​వద్ద ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘కారు గుర్తుకు ఓటేయకపోతే మీకు పింఛన్లు రావు అని మంత్రి జగదీశ్​రెడ్డి బెదిరించిండు.. పోలీసులు, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించిన్రు.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్​ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్​ రోజు (3వ తేదీ) సాయంత్రం వరకు నియోజకవర్గంలోనే ఉన్నరు. ఓటర్లకు పైసలు పంచిన్రు.. మద్యం ఏరులై పారిచ్చిన్రు. పోలీసుల సాయంతో మమ్మల్ని అష్టదిగ్బంధనం చేసిన్రు.. మా లీడర్లు, కార్యకర్తలు, పోలింగ్​ ఏజెంట్లను బెదిరించిన్రు.. ముఖ్యమంత్రి ఒత్తిడి తట్టుకోలేక ఆర్వో తప్పులు చేస్తే, దేశ చరిత్రలోనే ఎన్నికల మధ్యలో ఆయనను సస్పెండ్​ చేయాల్సిన పరిస్థితి వచ్చింది..’’ అని అన్నారు. ప్రజల పక్షాన పోరాడాల్సిన కమ్యూనిస్టు నాయకులు సిద్ధాంతాలు వదిలేసి, టీఆర్​ఎస్​ అవినీతి సొమ్ముకు అమ్ముడుపోయారని ఆయన విమర్శించారు. కమ్యూనిస్టుల ఓట్లు టీఆర్​ఎస్​కు కలిసి వచ్చాయని అన్నారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని, రాబోయే  రోజుల్లో తెలంగాణలో తప్పకుండా బీజేపీ జెండా ఎగురుతుందని రాజగోపాల్​రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్​ఎంసీలోగానీ, దుబ్బాకలో గానీ, హుజూర్​నగర్​లోగానీ, హుజూరాబాద్​లోగానీ ఇంత హోరాహోరీ పోరాటం జరగలేదని అన్నారు. కేసీఆర్​ ఆయన కుటుంబం చేస్తున్న అవినీతిని మొత్తం బయటకు తీసి, టీఆర్ఎస్​ను బొందపెట్టే శక్తి బీజేపీకి ఉన్నందునే ముఖ్యమంత్రికి బీజేపీ అన్నా, మోడీ, అమిత్​షా అన్నా  భయం పట్టుకుందని పేర్కొన్నారు.  కేసీఆర్​కుటుంబ దోపిడీని అడ్డుకునే శక్తి బీజేపీకి ఉందని తెలంగాణ సమాజం నమ్ముతున్నదని, మునుగోడులో బీజేపీ సాధించిన ఓట్లే ఇందుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ ఓట్లు10 వేల నుంచి 90వేలకు చేరడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ వెంట నడిచిన కార్యకర్తలు, లీడర్లకు, తమకు ఓట్లు వేసి మద్దతు ఇచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని రాజగోపాల్​రెడ్డి  అన్నారు.