చౌటుప్పల్, వెలుగు : కాంగ్రెస్ సునామీలో సీఎం కేసీఆర్ కుటుంబం కొట్టుకపోతుందని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్, గుజ్జా, మల్లారెడ్డిగూడెం, గుడిమల్కాపురంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక్కడే కొట్లాడితే తెలంగాణ రాలేదని, సంబండ వర్గాలు కొట్లాడి, పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పెడితేనే రాష్ట్రం వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కోసం యువకులు ఆత్మబలిదానం చేసుకొని బలయ్యారు తప్ప కేసీఆర్ కుటుంబం నుంచి ఎవ్వరూ బలిదానం చేసుకోలేదని, పదవులు మాత్రం ఆ కుటుంబం వాళ్లే అనుభవిస్తున్నారని మండిపడ్డారు.
2018 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డా కూడా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండొద్దన్న దుర్మార్గపు ఆలోచనతో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశించే సంఘాలను, వ్యక్తులను బీఆర్ఎస్ ప్రభుత్వం అణగదొక్కుతున్నదని వాపోయారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీలో నిద్రపోవడం తప్ప ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదన్నారు. ఈసారి కల్వకుంట్లను, కూసుకుంట్లను గొర్లకుంట చెరువులో పాతరేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, పీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి రెడ్డి, కాంగ్రెస్, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.