దోచుకున్న డబ్బులన్నీ కక్కిస్తం: రాజగోపాల్ రెడ్డి

తుంగతుర్తి, వెలుగు: తెలంగాణ పేరు చెప్పుకుని కేసీఆర్, జగదీశ్ రెడ్డి పదేండ్ల పాటు డబ్బులు దోచుకున్నారని, వాటన్నింటిని కక్కిస్తామని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్​చార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉద్యమ కాలంలో సెంటిమెంట్​ను రెచ్చగొట్టి విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకున్నారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సన్నాహక సమావేశం జరిగింది. దీనికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా రాజ్​గోపాల్ రెడ్డి మాట్లాడారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ‘‘కవిత తిహార్ జైలుకు వెళ్తదని అప్పుడే చెప్పిన. సూర్యాపేటలో రూ.100 కోట్లు ఖర్చు పెట్టి జగదీశ్ రెడ్డి జర్రంతలో గెలిచిండు. కిరాయి ఇంట్లో.. డొక్కు స్కూటర్​పై తిరిగిన జగదీశ్ రెడ్డికి వేల కోట్లు ఎట్లొచ్చినయ్..? నాగారంలో పెద్ద కోట, శంషాబాద్​లో 100 ఎకరాల ఫామ్​హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది?’’అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ తలుచుకుంటే.. బీఆర్ఎస్ ఖాళీ అవుతది

‘‘తుంగతుర్తి ప్రజల సహకారంతో బీఆర్ఎస్​ను బొంద పెట్టాం. నీకు, నీ బాస్ కేసీఆర్​కు అడ్రస్ లేకుండా చేస్తం. ఖబడ్దార్..’’అని మాజీ మంత్రి జగదీశ్​రెడ్డిని ఉద్దేశిస్తూ రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. దామోదర్ రెడ్డికి ఎదురు నిలిచే ధైర్యం జగదీశ్ రెడ్డికి లేదన్నారు. కాంగ్రెస్ తలుచుకుంటే.. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని హెచ్చరించారు. మరో 20 ఏండ్లు తమ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 21న భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారని, సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో సూర్యాపేట ఇన్​చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు వెంకన్న యాదవ్ పాల్గొన్నారు.