చౌటుప్పల్, నాంపల్లి ( చండూరు) వెలుగు : తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్లే ప్రభుత్వం మునుగోడుకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేసిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని కొత్త బీజేపీ ఆఫీస్‌ను ప్రారంభించారు. అలాగే నాంపల్లి మండలంలోని రేవెల్లి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.
ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కౌరవ సైన్యంతో పోరాడి 87 వేల ఓట్లు సాధించానని చెప్పారు. బీఆర్‌ఎస్ స్వల్ప మెజారిటీతో బయటపడ్డప్పటికీ నైతిక విజయం తనదేనని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిచేసుకొని బరిలో దిగుతానని, బీజేపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ గోని శంకర్, ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు రిక్కల సుధాకర్ రెడ్డి, మున్సిపల్ ప్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, నేతలు దూడల భిక్షం, పబ్బు రాజు, సైదులు, రమేశ్ పాల్గొన్నారు.