కల్వకుంట్ల అవినీతిని బయటపెడ్తా: రాజగోపాల్ రెడ్డి

చండూరు, వెలుగు:  కల్వకుంట్ల కుటుంబం లక్షకోట్ల అవినీతి చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బయటపెడుతామని కాంగ్రెస్‌ మునుగోడు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మునుగోడు క్యాంపు ఆఫీస్‌ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించి.. నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తాను నియోజకవర్గంలో తిరగనని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 నిధుల కోసం అసెంబ్లీలో  మొత్తుకున్నా సీఎం స్పందించకపోవడంతో రాజీనామా చేశానని, దాంతో  సీఎం సహా, వంద మంది ఎమ్మెల్యేలు వందల కోట్లు నిధులు వచ్చాయన్నారు. మునుగోడు పేరు వింటేనే  కేసీఆర్‌‌కు మూడు నెలలు  నిద్ర పట్టలేదని విమర్శించారు. తాను కాంగ్రెస్‌లోకి వస్తే వెయ్యి ఏనుగుల బలం వస్తుందని కార్యకర్తలు కోరడంతో తిరిగి సొంత గూటికి వచ్చానన్ననాను.  తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని,  ఊపిరి ఉన్నంతవరకు మునుగోడు ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు.  

ఉమ్మడి జిల్లా నుంచి ఈ సారి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా  అసెంబ్లీలో అడుగు పెట్టరని, ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అయ్యిందన్నారు.  బీజేపీ, బీఆర్‌‌ఎస్‌ ఒక్కటేనని, లిక్కర్ స్కామ్‌లో కవితను ఎందుకు అరెస్ట్ చేయడంలేదో చెప్పాలని నిలదీశారు.  కమ్యూనిస్టుల మద్దతుతో  విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి,  జిల్లా కార్యదర్శి నెల్లికంటి  సత్యం, మునుగోడు జడ్పీటీసీ నారాబోయిన స్వరూప రాణి, నారాబోయిన రవి, పీఏసీఎస్‌ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, నారాయణపురం ఎంపీపీ ఉమా ప్రేమచందర్ రెడ్డి, నాంపల్లి జడ్పీటీసీ ఏ.వి.రెడ్డి, నాంపల్లి వైస్ ఎంపీపీ పానుగంటి రజిని వెంకన్న, మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్  కార్యకర్తలు పాల్గొన్నారు.