రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ మునుగోడులో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన చేపట్టారు. మునుగోడు ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్లకురుమల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన డబ్బులను వెనక్కి తీసుకుందంటూ నిరసనకు దిగారు. కేసీఆర్ ప్రభుత్వం గొల్లకురుమలను మోసం చేసిందంటూ బీజేపీ ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీ అక్కడకు చేరుకుంది. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన చేపట్టిన ప్రాంతం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. తమ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
ఇటీవల జరిగిన మునుగోడు బైపోల్ లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10వేల ఓట్లకు పైగా తేడాతో విజయం సాధించారు. అక్కడ కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కలేదు.