ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేవంత్ కి వాటా : రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో బీజేపీ గెలిచాక టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని ఉప ఎన్నిక అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి చేపట్టిన రోజే తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయ్యిందని..మునుగోడులో కూడా తాను గెలిచాక టీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు.టీఆర్ఎస్ లో ప్రతి ఒక్కరు  అసంతృప్తిగా ఉందన్నారు. 2014 కంటే ముందు కేసీఆర్, జగదీష్ రెడ్డి ఆస్తులెంతో చెప్పాలన్నారు. ఈ ఏనిమిదేళ్లు కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించిందని ఆరోపించారు. నిజంగా రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోతే ..ఒక్కడిని ఓడించడానికి టీఆర్ఎస్ మంద  ఎందుకు మునుగోడులో ప్రచారం చేస్తుందని  ప్రశ్నించారు. బీజేపీ ఎప్పుడు డబ్బు రాజకీయాలు చేయదన్నారు. 

ఏడ్చే మగాన్ని నమ్మొద్దని... కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్  కుమ్మక్కయ్యాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు.  బీజేపీని ఓడగొట్టడానికి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తుందని ఆరోపించారు.  రేవంత్ రెడ్డికి, కవితకు వ్యాపార లావాదేవీలు నడుస్తున్నాయన్నారు.  మొన్న జరిగిన లిక్కర్ స్కాంలో రేవంత్ కి కూడా వాటా ఉందని ఆరోపించారు.

మునుగోడు తీర్పు తెలంగాణ భవిష్యత్తుపై ఆధారపడిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.  ప్రజలు  ఇప్పటికే  నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా మునుగోడులో టీఆర్ఎస్ గెలవదన్నారు. మునుగోడు ప్రజలను సీఎం అవమానించారన్నారు. తాను రాజీనామా చేసిన తర్వాతనే మునుగోడులో అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి ఇంకా 10 రోజుల సమయం ఉందన్నారు.  నవంబర్ 3న జరగబోయే ధర్మయుద్ధంలో అందరు పాల్గొనాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

గొల్లకుర్మలకు గొర్రెలు ఇవ్వకుండా ఓట్ల కోసం అకౌంట్లో డబ్బులు జమచేశారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. దాదాపు 9 వేల మందికి 90 కోట్ల రూపాయలు జమచేశారన్నారు. అయితే ఆ డబ్బుల్ని గొల్లకుర్మలు డ్రా చేసుకోకుండా అకౌంట్లను సీఎం ఫ్రీజ్ చేయించారని ఆరోపించారు.   కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఫ్రీజ్ చేయించిందని టీఆర్ఎస్   తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. గొల్లకుర్మలు బాధపడొద్దని..కేంద్రమంత్రి నిర్మలాసీతామన్ తో మాట్లాడి అకౌంట్లో ఫ్రీజ్ అయిన డబ్బులను ఇప్పిస్తానన్నారు. అంతేగానీ ప్రలోభాలకు లొంగి గొల్లకుర్మలు టీఆర్ఎస్ కు ఓటేయొద్దన్నారు. అవసరమైతే తన ఆస్తులు అమ్మైనా గొల్లకుర్మలకు డబ్బు ఇస్తానన్నారు.

కోమటి రెడ్డి ఆడియో లీక్ పై స్పందించిన రాజగోపాల్

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ పై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను  హుజురాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ లో ఉండి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈటల రాజేందర్ ను గెలిపించాలని కోరానన్నారు. ఇపుడు తమ సోదరుడు  కూడా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పాడని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు.  ఇక్కడ ప్రచారానికి వచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగం మంది తాను గెలవాలని కోరుకుంటున్నారని అన్నారు.