-
ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి లక్ష్మి హామీ
నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఊరూరా.. వాడవాడలా తిరుగుతున్న ఆమె మధ్యలో పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, వ్యవసాయ కూలీలను సైతం కలుస్తున్నారు. ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటూ.. తనవంతుగా పరిష్కారం చేయిస్తానని హామీలు ఇచ్చారు.
ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇవాళ గట్టుప్పల్ మండలంలో ప్రచారం ముగించుకుని తిరిగొస్తూ.. మార్గం మధ్యలో కూలీలను కలిశారు. పెన్షన్ డబ్బులు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ డబ్బులు వస్తున్నా మద్యం తాగడానికే సరిపోతలేవని, పెన్షన్ డబ్బులన్నీ బెల్టుషాపుల్లోనే ఖర్చుపెడుతున్నారని వాపోయారు. మహిళా కూలీల పరిస్థితి తెలుసుకుని ఓదార్చారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే గ్రామాలలో మద్యం బంద్ చేయిస్తామని కోమటిరెడ్డి లక్ష్మి హామీ ఇచ్చారు. పోయినసారి ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటు వేసారు.. ఇప్పుడు పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోమటిరెడ్డి లక్ష్మి కోరారు.