టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్ రాజీనామా చేశారు. బాధతోనే టీఆర్ఎస్ పార్టీతో 22ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం జైలు జీవితం సహా అనేక విషయాలలో కేసీఆర్ కు తోడుగా ఉన్నట్లు చెప్పారు. పదవులు కాదు..ఆత్మగౌరవం లేకనే పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. పోరాడి సాధించిన తెలంగాణలో ఉద్యమకారులు లేరని..ఉద్యమకారులను కేసీఆర్ ఆదరించే పరిస్థితి లేదన్నారు.
టీఆర్ఎస్ లో ఉన్నంత కాలం బాధ తప్ప ఇంకేం ఉండదని రాజయ్య అన్నారు. వాపును బలుపు అనుకోవడం మంచి పద్ధతికాదని..అలాంటి అనేక పార్టీలు కంటికి కనిపించకుండా పోయాయన్నారు. అనేక పార్టీలు తనతో టచ్ లోకి వచ్చాయని.. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తాము పార్టీకోసం పనిచేయడం వల్లే అవమానకరంగా చూస్తున్నారని..కాళ్లు మొక్కుడు తనకు అలవాటు లేదన్నారు. ఎమ్మెల్యేలు తప్ప అంతా అసంతృప్తితోనే ఉన్నారని ఆయన చెప్పారు.
రేపోమాపో మరికొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా వున్నారని రాజయ్య అన్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అని.. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలంగా లేదని చెప్పారు. -అందుకే యూత్ ఎక్కువగా బీజేపీతో పాటు ఇతర పార్టీల వైపు ఆకర్షితులువుతున్నట్లు వెల్లడించారు. తన కొడుకు కోసమే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారన్న ఆయన..టీఆర్ఎస్ పరాయి వాళ్ల చేతిలోకి వెళ్ళిపోయిందని తెలిపారు.