డాల్బీ సౌండ్ సిస్టమ్‌కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఇకపై విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు నాగార్జున. దీనిని శుక్రవారం దర్శకుడు రాజమౌళి లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఆర్ఆర్ఆర్’ సమయంలో సినిమాను డాల్బీ విజన్‌లో గ్రేడ్ చేయాలనుకున్నప్పుడు, మేము జర్మనీ వరకు వెళ్లాల్సి వచ్చింది. మన దేశంలోనే డాల్బీ విజన్‌లో నా సినిమాను ఎక్స్‌పీరియెన్స్ చేయలేకపోవడం కొంచెం నిరుత్సాహపరిచింది.
కానీ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సౌకర్యాన్ని చూసి థ్రిల్ అయ్యాను. నా తదుపరి సినిమా విడుదలయ్యే సమయానికి, భారతదేశం అంతటా మల్టీ డాల్బీ సినిమా ఉంటుంది అనేది మరింత గొప్ప విషయం’ అని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఇలాంటి కొత్త టెక్నాలజీని లాంచ్ చేయడం సంతోషంగా ఉందని నాగార్జున అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రియ యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.