![జనరల్ కేటగిరీలో ఆస్కార్ బరిలోకి ‘ఆర్ఆర్ఆర్’](https://static.v6velugu.com/uploads/2022/10/Rajamouli-once-again-raised-the-level-of-Indian-cinema-to-the-international-level-with-RRR_Pnv12lAROQ.jpg)
భారతీయ సినిమా స్థాయిని ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు రాజమౌళి. దీంతో ఈసారి ఆస్కార్ బరిలోకి ఈ సినిమా వెళ్లబోతోందనే అంచనాలు పెరిగాయి. కానీ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. ఆస్కార్‌కు పంపే చిత్రాల వరుసలో మాత్రం దీనికి స్థానం లభించలేదు. గుజరాతీ సినిమా ‘చెల్లో షో’ని ఎంపిక చేసింది ఫెడరేషన్. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులు నిరాశ పడ్డారు. అయితే ఇప్పుడీ మూవీ జనరల్ కేటగిరీలో ఆస్కార్ బరిలోకి వెళ్లబోతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.‘ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులతో ఇండియన్ సినిమా సత్తాను తెలియజేసేలా ‘ఆర్ఆర్ఆర్’కు భారీ సక్సెస్‌ను ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఆస్కార్ రేసులో పోటీకి జనరల్ కేటగిరీలో మా సినిమాను అప్లై చేశాం. మీ అందరి ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది’ అంటూ సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేశారు.
బెస్ట్ మోషన్ పిక్చర్, బెస్ట్ యాక్టర్‌గా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా అజయ్ దేవగన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఆలియా భట్, బెస్ట్ సినిమాటోగ్రఫీకి కేకే సెంథిల్ కుమార్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ‘నాటు నాటు’, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్‌కి సాబు సిరిల్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో కీరవాణి, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌కి రమా రాజమౌళి, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్‌కి శ్రీకర్ ప్రసాద్, బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్‌కి నల్ల శ్రీను, సేనాపతి నాయుడు, బెస్ట్ సౌండ్ కేటగిరీలో రఘునాథ్ కామిశెట్టి, బోలోయ్ కుమార్ డోలోయి, రాహుల్ కార్పే పేర్లతో పాటు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్‌కి వి. శ్రీనివాస్ మోహన్ పేరును ఆస్కార్‌కు అప్లై చేసింది టీమ్. మరి ఈ పదిహేను కేటగిరీల్లో ఏయే విభాగాల్లో ‘ఆస్కార్’ వరిస్తుందో చూడాలి!