
మారుతున్న ప్రేక్షకుల అభిరుచి, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా సినిమాలు చేస్తున్నారు రజినీకాంత్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న ఆయన.. మరోవైపు ‘జైలర్ 2’లో నటించబోతున్నారు. ఇవికాక ఆయన వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వడ చెన్నై, అసురన్, విడుదలై లాంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్నాడు వెట్రిమారన్.
ఫిల్మ్ మేకింగ్‌లో తన రియలిస్టిక్ అప్రోచ్ నచ్చి ఎన్టీఆర్ లాంటి హీరోలు తనతో వర్క్ చేయాలని ఉందంటూ పబ్లిక్‌గా ప్రకటించారు. తన మేకింగ్ స్టైల్ రజినీకాంత్‌ను కూడా ఇంప్రెస్ చేసిందట. ఈ నేపథ్యంలో రజినీకాంత్ కోరిక మేరకు కొన్ని స్టోరీ ఐడియాస్ చెప్పిన వెట్రిమారన్.. పూర్తిస్థాయి కథ సిద్ధం చేసేందుకు కొంత సమయం అడిగినట్టు కోలీవుడ్ సమాచారం.
ప్రస్తుతం రజినీకాంత్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి కనుక అవి పూర్తయ్యేలోపు ఈ కొత్త ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.