- 23న వేములవాడ బంద్‌కు అఖిలపక్షం పిలుపు
- కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దహనాలు
వేములవాడ, వెలుగు: కేసీఆర్ పోటీచేయబోయే కామారెడ్డి నియోజకవర్గంలోని గుడులకు ఎములాడ రాజన్న ఆలయం నుంచి రూ.5 కోట్లు కేటాయిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులపై వేములవాడలో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. సీఎం వైఖరికి నిరసనగా ఈనెల 23న వేములవాడ బంద్‌కు అఖిలపక్షం పిలుపునివ్వగా, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున నాలుగేండ్ల పాటు రూ.400 కోట్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్..ఆ పని చేయకుండా, ఇప్పుడు రాజన్న ఆలయం నుంచే ఉల్టా ఫండ్స్ తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని నేతలు ప్రశ్నించారు.
సీఎం దిష్టిబొమ్మల దహనం..
ఎండోమెంట్ కమిషర్ జారీ చేసిన ఉత్తర్వులకు నిరసనగా గురువారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేములవాడ టౌన్లో వేర్వేరుగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. బీజేపీ అధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ఎదుట సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసిన నిరసన తెలిపారు. రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కేసీఆర్, ఇప్పుడు ఆ దేవుడికే శఠగోపం పెట్టాలని చూస్తున్నాడని, వెంటనే ఉత్తర్వులు ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని రెండు పార్టీల నాయకులు హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు జక్కుల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
రేపు వేములవాడ బంద్
నిధుల తరలింపునకు నిరసనగా శనివారం వేములవాడ పట్టణ బంద్ కి పిలుపునిచ్చినట్లు జేఏసీ కన్వీనర్ నేరేళ్ల తిరుమల్ గౌడ్ తెలిపారు. గురువారం వేములవాడలో అఖిలపక్ష నాయకులు సమావేశం నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ తిరుమల గౌడ్ మాట్లాడుతూ 23వ తేదీన పట్టణ బంద్‌కు, వ్యాపార, వాణిజ్య, సంఘ నాయకులు, షాప్ యజమానులు సహకరించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ప్రతాప రామకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పులి రాంబాబు గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బీఎస్పీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంట రాజు, సీపీఐ లీడర్లు కడారి రాములు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.