బీజేపీలో చేరనున్న సిరిసిల్ల లీడర్లు

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం బీఆర్ఎస్​కు భారీ షాక్​ తగిలింది. వివిధ జిల్లాల్లోని ముఖ్యమైన లీడర్లు పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. వనపర్తిలో ఏకంగా జడ్పీ చైర్మన్​, మరో ఇద్దరు ఎంపీపీలు, నల్గొండ జిల్లాలోని బీఆర్​ఎస్​ సీనియర్​లీడర్​చకిలం అనిల్ కుమార్ ‘కారు’ దిగుతున్నట్టు ప్రకటించారు.   

మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి తీరుతో... 

వనపర్తి జిల్లాలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కొంతకాలంగా విభేదిస్తున్న జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డితో పాటు వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘా రెడ్డి, మరికొందరు బీఆర్ఎస్ లీడర్లు గురువారం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ లో తమకు ప్రాధాన్యం లేకపోవడం వల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నామన్నారు. గురువారం ఖిల్లా గనపురం మండలంలోని సల్కలాపూర్ లో అసమ్మతి నేతలంతా సమావేశం కానున్నారు. వీరంతా త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.  
 

నల్గొండలో చకిలం అనిల్​కుమార్​..

తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ లీడర్​చకిలం అనిల్ కుమార్ కూడా బీఆర్​ఎస్​కు రాజీనామా చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. తన రిజైన్​ లెటర్​ను ఫ్యాక్స్ ద్వారా  హైకమాండ్​కు పంపించినట్లు చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుని ఉన్న తనను కేసీఆర్ నట్టేట ముంచాడని, క్లిష్ట పరిస్థితుల్లో జిల్లాలో పార్టీని కాపాడినా తనకు ప్రాధాన్యత దక్కట్లేదని బుధవారం కన్నీళ్లు పెట్టుకున్నారు. 2014 లో సీఎం కేసీఆర్​ తనను నల్గొండ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని, 2018 లో టీడీపీ నుంచి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డి ని గెలిపిస్తే ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడన్నారు. నాడు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డ వాళ్లందరూ బీఆర్ఎస్ లో పెత్తనం చెలాయిస్తుంటే ఉద్యమకారులు ఎటు పోవాలని ప్రశ్నించారు. ముఖ్య నేతలు అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్​కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే నల్గొండ నుంచి ఇండిపెండెంట్​గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. త్వరలో కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకతాటి పైకి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెడతానని చెప్పారు. 

బీజేపీలో చేరనున్న సిరిసిల్ల లీడర్లు

గత నెల10న బలమైన పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లగిశెట్టి శ్రీనివాస్ బీజేపీలో చేరగా, కొంతకాలంగా బీఆర్​ఎస్​కు దూరంగా ఉంటున్న మరో ఇద్దరు సీనియర్​ లీడర్లు కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. ముస్తాబాద్ మండలం మాజీ ప్యాక్స్ చైర్మన్​, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కనిమేని చక్రధర్ రెడ్డి, గంభీరావుపేట మండలం ముస్తాఫ్​నగర్ సర్పంచ్ కొక్కు సంధ్య రాణి భర్త, సెస్ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ అనుచరులతో కలిసి గురువారం బండి సంజయ్​ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కింద కొక్కు దేవేందర్​యాదవ్​బీజేపీ స్టేట్​చీఫ్​ బండి సంజయ్​ను కలిశారు. బీఆర్ఎస్ లో నిజాయతీగా పని చేసేవారికి స్థానం లేదని  మండిపడ్డారు.