గంగాధర/బోయినిపల్లి, వెలుగు : పంటల సాగుకు నీరు విడుదల చేయకుంటే ఊరుకునేది లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ హెచ్చరించారు. కరీంనగర్జిల్లా గంగాధర, రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలాల్లో గురువారం ప్రజాహిత యాత్ర నిర్వహించారు. మొదట గంగాధర మండలం గర్శకుర్తిలో రూ.5 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు, రూ.5 లక్షలతో చేపట్టనున్న చేనేత కార్మికుల కమ్యూనిటీ హాల్, వేంకటేశ్వరస్వామి టెంపుల్‌లో మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలకే దిక్కులేదని, ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తే మహిళలకు రూ.లక్ష ఇస్తామని రాహుల్‌గాంధీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌లో సగం పదవులను మహిళలకు ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. బోయినిపల్లి మండలం బూరుగుపల్లిలో మహిళలతో రచ్చబండ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్ పెరుక శ్రావణ్, మండల అధ్యక్షుడు కోల అశోక్ పాల్గొన్నారు.