- రాజన్నజిల్లాలో గుట్టలను కొల్లగొడుతున్న అక్రమార్కులు
- చంద్రగిరి, ఎద్దుగుట్ట, మైసమ్మ గుట్టల నుంచి జోరుగా మట్టి రవాణా
- సిరిసిల్ల, వేములవాడ పట్టణాల శివారుల్లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
రాజన్నసిరిసిల్ల,వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మట్టి మాఫియా విజృంభిస్తోంది. గుట్టుగా గుట్టల నుంచి మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. జిల్లాలో మొరం, మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా కొంతమంది ట్రాక్టర్, టిప్పర్లతో అక్రమ రవాణా చేస్తున్నారు. జిల్లాలోని చంద్రగిరి, ఎద్దుగుట్ట, మైసమ్మ గుట్టల నుంచి జోరుగా మట్టి దందా నడుపుతున్నారు. రాత్రిళ్లు వేల టిప్పర్ల మట్టిని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాలో మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
రాత్రయితే జోరుగా దందా
రాజన్న జిల్లాలో రాత్రయితే మట్టి మాఫియా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా గుట్టలను గుల్ల చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణ శివారులోని ఎద్దుగుట్ట, మైసమ్మ గుట్టల నుంచి, వేములవాడ సమీపంలోని చంద్రగిరి గుట్టలను స్వాహా చేస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ. 3వేల నుంచి రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇండ్లు, కమర్షియల్ నిర్మాణాల్లో వివిధ అవసరాలకు మొరం, మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో రాత్రయితే ఓ టీంను ఏర్పాటు చేసుకుని కాపలా కాస్తూ మరీ టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారు. సిరిసిల్ల రగుడు బైపాస్ సమీపంలో పదుల సంఖ్యల్లో మైనింగ్ కేంద్రాలు అక్రమంగా కొనసాగుతున్నాయి. ఇవే కాక జిల్లాల్లో వెంకటాపూర్, సర్థాపూర్ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కోసం దారులు వెతుకుతున్నారు.
జరిమానాలతో సరిపెడుతున్నరు
మైనింగ్ అధికారులు అక్రమ దందాను గుర్తించి అప్పుడప్పుడు టిప్పర్లను పట్టుకుని సీజ్ చేస్తున్నారు. కాగా మట్టి దందాలో లీడర్లు ఉంటుండడంతో అధికారులపై ఒత్తిళ్లు పెరుతున్నాయి. దీంతో జరిమానాలతో సరిపెడుతున్నారు. కొంతమంది అధికారులకు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉండడంతో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సిరిసిల్ల సమీపంలోని గుట్టల నుంచి మట్టి తోలుతున్న టిప్పర్ల శబ్ధాలతో పెద్దూరు, జెగ్గరావుపల్లె గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు.
236 కేసులు నమోదు చేశాం
జిల్లాలో మట్టి అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నాం. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అక్రమ రవాణాపై 236 కేసులు నమోదు చేశాం. రూ.19.13లక్షల పెనాల్టీలు విధించాం. గుట్టల వద్ద మైనింగ్ చేయరాదనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. మైనింగ్ కు పాల్పడితే చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల తహసీల్దార్లకు నోటీసులు జారీ చేశాం
- క్రాంతికుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా మైనింగ్ ఆఫీసర్