సిరిసిల్ల కబ్జారాయుళ్లపైనా  ఖాకీల ఉక్కుపాదం 

  •   గత ప్రభుత్వ హయాంలో జరిగిన కబ్జాలపై కేసులు 
  •   కబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ ‌‌ లీడర్లలో గుబులు
  •   బాధితుల ఫిర్యాదులపై చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు

రాజన్నసిరిసిల్ల,వెలుగు :  రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలపై పోలీసులు ఫోకస్​ పెట్టారు. జిల్లాలో భూ ఆక్రమణలపై బాధితులు ఫిర్యాదులు చేస్తుండగా భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లీడర్ల ఆగడాలపై బాధితులు ఇప్పుడిప్పుడే ధైర్యంగా బయటికి వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇన్నాళ్లు ఆ పార్టీ అధికారంలో ఉండగా ఫిర్యాదులు చేసేందుకు బాధితులు భయపడ్డట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారడంతో భూకబ్జాలపై బాధితులు  కేసులు పెడుతున్నారు. పోలీసులు సైతం బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఐదుగురు బీఆర్ఎస్ ‌‌ లీడర్లపై కేసులు నమోదయ్యాయి. 

భూకబ్జాలపై పోలీసుల నజర్​

రాజన్నసిరిసిల్ల జిల్లాలో గత ప్రభత్వ హయాంలో జరిగిన భూఆక్రమణలపై పోలీసులు చర్యలకు దిగుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్​ లీడర్లపై కేసులు నమోదవుతున్నాయి. బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన రాజ్యసభ ఎంపీ సంతోష్ రావు తండ్రి జోగినిపల్లి రవీందర్ రావుపై  భూ వివాదంలో కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ ‌‌ లీడర్ ‌‌ ‌‌, మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేశ్ ‌‌పై కేసు నమోదైంది. భూ ఆక్రమణకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడం సిరిసిల్లలో రాజకీయంగా చర్చనీయాశమైంది.

ఇప్పటికే ఆయన ఈ కేసులో కోర్టు నుంచి బెయిల్ ​తెచ్చుకున్నాడు. తమ భూములు కబ్జాచేశారన్న బాధితుల ఫిర్యాదుతో తంగళ్లపల్లి మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్యపై, ఇదే మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన సర్పంచ్ భర్త రమేశ్ ‌‌పై పోలీసుల కేసులు పెట్టారు. ముస్తాబాద్ మండలంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని ప్రజల నుంచి సుమారు రూ.కోటి వసూలు చేసిన ఓ స్వచ్చంద సంస్థ వెనుక బీఆర్​ఎస్ నేతలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  దీనిపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్​ చేస్తున్నట్లు సమాచారం. 

ఫిర్యాదు అందితే కేసే 

రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ లీడర్లపై భూ కబ్జాలకు సంబంధించి ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. నెల కింద మంత్రి పొన్నం ప్రభాకర్.. భూ కబ్జాలపై జిల్లా

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ అక్రమణలు, కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని, ఎవ్వరినీ వదిలిపెట్టొద్దని ఆదేశించారు. భూకబ్జాదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. దీంతో అధికారులు భూకబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.