రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపిన యువతి కిడ్నాప్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తాను ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు యువతి తెలిపింది. జానీ అనే యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. నాలుగేళ్లుగా తామిద్దరూ ప్రేమించుకుంటున్నామని చెప్పింది. తన కోరిక మేరకే జానీ తీసుకెళ్లాడని... అతడిని ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకున్నానని తెలిపింది. తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. అందుకే.. వచ్చి తీసుకెళ్లమని జానీకి ఫోన్ చేసి చెప్పానని యువతి వెల్లడించింది. తీసుకెళ్లేముందు అతనికి మాస్క్ ఉండడంతో గుర్తుపట్టలేదని.. జానీ అని తెలిసిన తర్వాత ఇష్టపూర్వకంగానే వెళ్లి.. వివాహం చేసుకున్నానని తెలిపింది. తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని.. పోలీసులు రక్షణ కల్పించాలని వీడియోలో కోరింది
ఇదిలా ఉంటే.. యువతి తల్లిదండ్రులు తమ కూతుర్ని బెదిరించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. తమ కూతురికి ఏం తెలియదని.. ఆమెను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని జానీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతుర్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు. గతంలో కూడా ఇలాగే చేశాడని అతడిని వదిలిపెట్టొద్దని చెబుతున్నారు.
చందుర్తి మండలం మూడపల్లిలో నలుగురు యువకులు ఇవాళ తెల్లవారుజామున కారులో వచ్చి షాలిని అనే యువతిని బలవంతంగా తీసుకెళ్లిన విషయం తెలిసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె తండ్రిని తోసేసి యువతిని కారులో తీసుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. అంతలోనే యువతి సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో.. ఆమె సేఫ్ గానే ఉందని తెలిసింది.