ఎన్నికల నిర్వహణలో అలెర్ట్​గా ఉండాలి : అభిషేక్ మహంతి

కరీంనగర్ క్రైం, వెలుగు : నామినేషన్ ప్రక్రియ ముగిసేదాకా కమిషనరేట్ వ్యాప్తంగా పటిష్ట  బందోబస్త్ ఏర్పాటు చేశామని కరీంనగర్ ​సీపీ అభిషేక్ మహంతి తెలిపారు.  సోమవారం సీపీ మాట్లాడుతూ బందోబస్తుకు అడిషనల్ డీసీపీ (శాంతి భద్రతలు) ఎ.లక్ష్మీనారాయణను నియమించినట్లు చెప్పారు. సాధారణ బందోబస్త్ విధుల్లో ఉన్న సిబ్బందితో పాటు, మూడు స్పెషల్ టాస్క్​ఫోర్స్‌ టీంలను కేటాయించామన్నారు.  అనంతరం కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. 

సమస్యాత్మక సెంటర్లపై దృష్టి పెట్టాలి

వేములవాడరూరల్, వెలుగు :  శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు. సోమవారం వేములవాడ రూరల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పోలింగ్​స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ లో మౌలిక సౌకర్యాల ఏర్పాటును ముందుగానే చూసుకోవాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్​ నిర్వహించాలన్నారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సీఐ కృష్ణకుమార్, ఎస్ఐ మారుతి, సిబ్బంది ఉన్నారు.

నిజాయతీగా ఓటేయాలి 

కరీంనగర్ టౌన్, వెలుగు :  రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును డబ్బు, ప్రలోభాలకు అమ్ముకోకుండా నిజాయతీగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల  అధికారి, కలెక్టర్  పమేలా సత్పతి  అన్నారు.  సోమవారం స్థానిక గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ  కాలేజీలో   నిర్వహించిన స్వీప్ ఓటు అవగాహన  కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం గాంధీ రోడ్డులోని దివ్యాంగుల, వయోవృద్ధుల వసతి గృహాన్ని కలెక్టర్​సందర్శించారు. 80 ఏండ్లకు పైబడిన వారు పోలింగ్​స్టేషన్‌కు వెళ్లకుండానే ఇంటి నుంచే ఓటేయొచ్చన్నారు.  ఆయా కార్యక్రమాల్లో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్ డీఆర్డీవో సంధ్యారాణి, మెప్మా పీడీ బి.రవీందర్, ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.