చెక్‌‌‌‌‌‌‌‌డ్యాం పనుల్లో సాగదీత.. వచ్చే వేసవిలోనైనా పూర్తయ్యేనా

చెక్‌‌‌‌‌‌‌‌డ్యాం పనుల్లో సాగదీత..  వచ్చే వేసవిలోనైనా పూర్తయ్యేనా
  •  జిల్లాలో 24 చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంల నిర్మాణానికి రూ.155కోట్లు 
  •  పనులు పూర్తికాక సాగునీటికి అవస్థలు పడుతున్న రైతులు 
  •  మూడేండ్లుగా సాగుతున్న పనులు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిర్మించ తలపెట్టిన చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. రైతులకు సాగునీరు అందించేందుకు, భూగర్భ జలాలు పెంచేందుకు మానేరు, మూలవాగుపై రూ.155 కోట్లతో 24 చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంలు నిర్మించాలని 2021లో గత సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయించింది. వీటిలో కేవలం 7 పూర్తికాగా.. మిగతావి నత్తనడకన సాగుతున్నాయి. నిధులు మంజూరయినా పనుల పర్యవేక్షణలో నాటి పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహించడంతో మూడేండ్లుగా పూర్తికావడం లేదు.

ఇదే అదునుగా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా, లోపభూయిష్టంగా నిర్మించిన చెక్ డ్యాంలు కొన్ని వరదలకు కూలిపోగా, మరికొన్ని  నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వేసవిలో నదుల్లో నీటి ప్రవాహం తక్కువ ఉండడంతో ఈసారైనా పనుల్లో వేగం పెంచి పూర్తి చేస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు. 

7 పూర్తయ్యాయి... మిగతావి సాగుతున్నాయ్

గత సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 24 చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంల నిర్మాణానికి పనులు ప్రారంభించగా 7 పూర్తవగా, మరో 17 నత్తనడకన సాగుతున్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏడాదిలోపే పూర్తి చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ అధికారుల ఉదాసీనతతో పనులు స్లోగా సాగుతున్నాయి. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి, జయవరం, మల్లారం మూడు గ్రామాల్లో ఈ చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంలు నిర్మాణ పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌  చేశారు. మల్లారంలో పనులు దాదాపు పూర్తయ్యాయి. జయవరం, లింగంపల్లిలో పనులు 60 నుంచి 70 శాతం వరకు పూర్తయ్యాయి. కోనరావుపేట మండలం మూలవాగుపైన మరిమడ్ల, నిమ్మపల్లి,కొండాపూర్, వెంకట్రావుపేట,నిజామాబాద్, మామిడిపల్లి గ్రామాల మధ్య 6 చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు.

వెంకట్రావు పేట,మామిడిపల్లి గ్రామాల్లోని మూలవాగులో నిర్మిస్తున్నవి పునాది దశలోనే ఉన్నాయి. వర్షకాలంలో మూలవాగు ప్రవాహం ఉధృతంగా ఉండడంతో పనులు సాగలేదని అధికారులు చెబుతున్నారు. మరిమడ్ల, నిమ్మపల్లి,కొండాపూర్, నిజాంబాద్ గ్రామాల్లోని చెక్ డ్యాంల పనులు చివరి దశకు చేరుకోగా మైనర్ వర్క్స్ మిగిలి ఉన్నాయి. బోయినిపల్లి మండలం మన్వాడ, మల్లాపూర్ గ్రామాల పరిధిలో మిడ్‌‌‌‌‌‌‌‌మానేర్ ప్రాజెక్టు కింది భాగంలో రెండు చెక్ డ్యాంలు నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు.

కానీ కింది భాగంలో నీటి నిల్వ ఉండడంతో పక్కకు పెట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం మానేరు వాగుపై పదిర గ్రామంలో నిర్మిస్తున్న చెక్ డ్యాం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని బీజేపీ లీడర్లు పనులు అడ్డుకున్నారు.  మరోవైపు చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంల నిర్మాణాలు స్లోగా సాగుతుండడంతో నీటిని నిల్వ చేయడంలేదు. ఇదే అదునుగా అక్రమార్కులు ఇసుక దోపిడీకి తెరలేపారు. రాత్రిళ్లు మానేరు, మూలవాగుల్లో ఇసుక తరలిస్తున్నారు. 

పూర్తయినవి.. పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నవి.. 

గంభీరావుపేట మండలంలో  నర్మాల, ఎల్లమ్మటెంపుల్, ఎల్లారెడ్డిపేట మండలం సింగారం, వీర్నపల్లి మండలం గర్జనపల్లి, కోనరావుపేట మండలం కొలనూర్, నిజాంబాద్, వేములవాడ అర్బన్ మండల కేంద్రంలోని చెక్ డ్యాంలు పూర్తయ్యాయి.  గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట, ఆర్అండ్‌‌‌‌‌‌‌‌బీ బ్రిడ్జి, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, పదిర, తంగళ్లపల్లి మండలం కస్బేకట్కూర్, ముస్తాబాద్ మండలం ఆవునూర్, సిరిసిల్ల మండలం పెద్దూర్, సాయినగర్, కోనరావుపేట మండలం మరిమడ్ల, నిమ్మపల్లి, వెంకట్రావుపేట, మామిడిపల్లి, వేములవాడ మండలం మల్లారం, తిమ్మాపూర్, మహాలక్ష్మి టెంపుల్, బొల్లారం, జయవరం గ్రామాల్లో నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 

ఏడాదిలోగా అన్ని చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంలను పూర్తి చేస్తాం

ఈ ఏడాది వేసవి కాలంలో పనుల్లో వేగం పెంచి చెక్ డ్యాం పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇన్నాళ్లు వాగుల్లో నీరు ఉండడంతో పనులకు ఆటంకం కలిగింది. మానేరు వాగుపై 10 నిర్మాణంలో ఉండగా గతేడాది మూడు కంప్లీట్ అయ్యాయి. మరో ఏడు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఏడాదిలో దాదాపు జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్నింటిని పూర్తిచేస్తాం.