40 ఏండ్ల కింది ఇండ్ల జాగాలను అమ్మలేరు.. కొనలేరు..

  • ట్రాన్స్​ఫరబుల్​ పట్టాలుగా మారుస్తామని కేటీఆర్​హామీ 
  • నేటికీ నిలబెట్టుకోలే..
  • క్రయవిక్రయాలకు అవకాశం ఇవ్వాలని నేత కార్మికుల వేడుకోలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేత కార్మికుల పోరాటంతో 1980లో నాటి సర్కార్​3వేల మందికి ఇండ్ల స్థలాలు కేటాయించింది. ఈ జాగాలు ఇచ్చి 40 ఏండ్లు దాటినా నేటికీ వాటిని అమ్ముకునేందుకు అవకాశం లేదు. స్థలాలు పొందిన నేత కార్మికులు వాటిని రిజిస్ట్రేషన్​ చేయించి ట్రాన్స్​ఫరబుల్‌‌ పట్టాలుగా మార్చాలని అప్పటి నుంచి ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నారు. ఈ స్థలాలకు నాలుగేండ్ల కింద కేటీఆర్​ సర్వే చేయించి పట్టాలు ఇప్పించారు. అయితే వాటికి రిజిస్ట్రేషన్​ చేయించలేదు. అనంతరం ఆ పట్టాలను ట్రాన్సఫరబుల్​గా మార్చేందుకు జీవో తెస్తామని  హామీ  ఇచ్చినా  నేటికీ నెరవేరలేదు. మరోవైపు తమకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను అవసరాల కోసం అమ్ముకునే  అవకాశం ఇవ్వాలని స్థలాలు పొందినవారు కోరుతున్నారు. 

పోరాడి సాధించుకున్నరు..

1979లో సిరిసిల్ల పట్టణంలోని రాయిని చెరువులో కార్మికులు గుడిసెలు వేసుకుని ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేశారు. సుమారు 3 ఏండ్ల పోరాటం తర్వాత సర్కార్​ 3వేల మంది కార్మికులకు సర్వే నంబర్​703లో 153 ఎకరాల్లో ఇండ్ల స్థలాలు కేటాయించింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో సుందరయ్య నగర్‌‌‌‌, బీవైనగర్‌‌‌‌, ఇందిరానగర్‌‌‌‌, గణేశ్​నగర్‌‌‌‌ కాలనీలు వెలిశాయి. కాగా ఈ జాగాలకు రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో వాటిని అమ్ముకునేందుకు అవకాశం లేదు. దీంతో రూ.లక్షల విలువైన ఆస్తి ఉన్నా  ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అయితే మంత్రి కేటీఆర్​ చొరవతో ఈ స్థలాన్ని సర్వే చేయించి 3052 మందికి పట్టాలు ఇచ్చారు. 

అప్పటి నుంచి బాండ్​ పేపర్లు, అఫిడవిట్ల ద్వారా భూములను అమ్మక కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే నివాసం ఉంటున్నవారు ఒకరైతే, పట్టాలు మరొకరి పేరు మీద ఉండటంతో ఇండ్ల నిర్మాణానికి మున్సిపల్​శాఖ పర్మిషన్లు ఇవ్వడంలేదు. కానీ చాలామంది పర్మిషన్లు లేకుండానే ఇండ్లు కడుతున్నారు.  పర్మిషన్లు లేకపోవడంతో  వీటికి హౌజింగ్​లోన్లు రావడం లేదు.

రూ.లక్షల ఆస్తి ఉన్నా ఫాయిదా లేకపాయే

నాకు బీవైనగర్ లో సర్కార్ ​40 ఏండ్ల కింద ఇంటి స్థలం మంజూరు చేసింది. దానికి రిజిస్ట్రేషన్ లేకపోవడంతో అమ్మకానికి అవకాశం లేదు. దీంతో రూ.లక్షల విలువ చేసే ఆస్తి ఉన్నా ఫాయిదా లేదు. ప్రభుత్వం వెంటనే ఈ ఇంటి స్థలాలను ట్రాన్సఫరబుల్​ పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి. మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని కార్మికులకు ఈ అవకాశం కల్పించాలే.
- మూషం రమేశ్‌‌, బీవైనగర్

మంత్రి హామీ నెరవేరేదెప్పుడో

సిరిసిల్లలో సుందరయ్యనగర్, బీవైనగర్,  ఇందిరానగర్, పద్మనగర్ కాలనీల్లో క్రయవిక్రయాలకు అనుగుణంగా జీవో తెస్తామని మంత్రి కేటీఆర్​నాలుగేండ్ల కింద హామీ ఇచ్చారు. సిరిసిల్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉందని, దీనికోసం ప్రత్యేక చట్టం చేస్తామని చెప్పారు. ఈ హామీ ఇచ్చి నాలుగేండ్లయినా నేటికీ నెరవేరలేదు. ఇండ్లు, స్థలాల రిజిస్ట్రేషన్లు అయితేనే అమ్మకాలకు అవకాశం ఉండడంతో, మంత్రి చొరవ చూపాలని నేత కార్మికులు కోరుతున్నారు.