శివరాత్రికి రాజన్న ఆలయం ముస్తాబు

4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
సుమారు రూ. 3.03 కోట్లతో ఏర్పాట్లు
స్పెషల్ బస్సులు నడిపిస్తున్న ఆర్టీసీ

వేములవాడ, వెలుగు : వేములవాడ మహాశివరాత్రి వేడుకల కోసం రాజన్న ఆలయం ముస్తాబైంది. వేడుకలకు మన రాష్ర్టంతో పాటు ఏపీ, మహారాష్ర్ట, చత్తీస్​గఢ్​ల నుంచి సుమారు 4  లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే మంత్రి కేటీఆర్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్​ అనిల్​కుమార్​, కలెక్టర్​ అనురాగ్​ జయంతి, ఈఓ కృష్ణ ప్రసాద్​ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  సుమారు రూ.3.03 కోట్లతో పనులు చేస్తున్నారు. 400 వసతి గదులు మాత్రమే ఉండడంతో గుడి చెరువు గ్రౌండ్​లో చలువ పందిళ్లు వేశారు. తాగునీటి వసతితో పాటు స్నానాల ఘాట్​లు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. రాత్రి జాగరణ చేసే భక్తుల కోసం శివార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీని కోసం దేశవ్యాప్తంగా కళాకారులు తరలివచ్చారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఆలయం సిబ్బందితో పాటు ఇతర జిల్లాల నుంచి మున్సిపల్‌ కార్మికులు, తాత్కాలిక కార్మికుల సేవలను ఉపయోగించుకుంటున్నారు.  

4 లక్షల లడ్డూలు..10 క్వింటాళ్ల పులిహోరా సిద్ధం

శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతరకు వచ్చే భక్తుల కోసం అధికారులు 4 లక్షల లడ్డూలు, 10 క్వింటాళ్ల పులిహారా సిద్ధం చేస్తున్నారు. 100 గ్రాములతో లడ్డూలు,  250 గ్రాములతో పులిహారా ప్యాకెట్లు ఉండనున్నాయి. 100 గ్రాముల లడ్డూ రూ.20, 500 గ్రాముల లడ్డూ రూ.100,  పులిహార రూ. 15 కు అమ్మనున్నారు. కౌంటర్లలోనే కాకుండా దర్శనం చేసుకొని బయటకు వెళ్లే మార్గాల్లో ప్రసాదాన్ని అందుబాటులో ఉంచనున్నారు.  

850 స్పెషల్​ బస్సులు

ఉత్సవాల కోసం 850 ప్రత్యేక జాతర బస్సులను నడుపుతున్నామని అర్టీసీ అధికారులు చెప్పారు. వేములవాడ బస్టాండ్, కామారెడ్డి డిపో, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్, కరీంనగర్-1, కరీంనగర్-2, హైదరాబాద్ రూట్ల నుంచి స్పెషల్​బస్సులు వేశారు. వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు వెళ్లడానికి 24 గంటల పాటు నడిచేలా 14 మినీ బస్సులను సిద్ధం చేశారు. ఈ సేవలు ఉచితమని చెప్పారు.  

11 అత్యవసర వైద్య సేవ కేంద్రాలు

భక్తులకు వైద్య సాయం కోసం11 అత్యవసర కేంద్రాలు,  163 మంది వైద్య సిబ్బందిని నియమించామని డీఎంహెచ్​ఓ డా. సుమన్​ మోహన్​రావు తెలిపారు. జాతర జరిగే ప్రాంతాలైన తిప్పాపూర్‌, జగిత్యాల బస్టాండ్​ఏరియాలు, నాంపల్లిగుట్ట, అమ్మవారి కాంప్లెక్స్‌, రాజేశ్వరపురం, ప్రధానాలయం ముందు, భీమేశ్వర ఆలయం వద్ద, సంస్కృత కళాశాలల్లో ఎమర్జెన్సీ హెల్త్​ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  వేములవాడ కి వచ్చే అన్ని దారుల్లో అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు అంబులెన్స్​లు, రెండు రెస్క్యూ టీమ్స్​ను అందుబాటులో ఉంచారు.  

మహా శివరాత్రి రోజు నిర్వహించే పూజలివే.. 

మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 17 రాత్రి 9 గంటల నుండి నిశీపూజ తర్వాత అన్ని పూజలను రద్దు చేసి కేవలం భక్తుల సౌకర్యార్థం లఘు దర్శనం, కోడె మొక్కుబడి నిర్వహిస్తారు. 18వ తేదీ మొదలుకాగానే 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వేములవాడ పట్టణవాసులకు సర్వదర్శనం, ఉదయం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు ఆలయం శుద్ది ఉంటుంది. 4 గంటల నుంచి 4.25 వరకు సుప్రభాతం, 4.25 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాత:కాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం, 7 గంటల నుంచి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం, ఉదయం 8 గంటలకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ పట్టు వస్ర్తాల సమర్పణ, సాయంత్రం 4 గంటల నుంచి శివదీక్ష స్వాములకు దర్శనం,  సాయంత్రం 6.05 నిమిషాలకు శ్రీస్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 నిమిషాలకు లింగోధ్భవ కాలమందు శ్రీస్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు.