
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్లో ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్ల పై సమీక్షించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, షామియాన, మౌలిక వసతులు కల్పించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ, బ్యాలెట్ పేపర్ తయారీ, ప్రతి పోలింగ్ స్టేషన్ ఉన్న పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్డ్ ఆయుధాల కలిగి ఉన్న వారి వివరాలు సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మీడియా సెంటర్ పరిశీలన
అసెంబ్ల ఈఎన్నికల కోసం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ)ను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.