
మెదక్ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా వంద శాతం ఓటింగే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. మంగళవారం “నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను.. మీరు కూడా వేయండి” అనే నినాదంతో ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకొని మెతుకు సీమ సత్తా చాటాలన్నారు.
ఈ నెల 30న ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో 579 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఓటు వేయడానికి వెళ్లే టప్పుడు 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తమ వెంట తీసుకెళ్లాలన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారందరూ తప్పకుండా ఓటు వేయాల్సిందిగా సూచించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని ఓటర్లందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వేస్తామని జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ మహేందర్ , డీఎస్పీ ఫణీందర్, జిల్లా యువజన క్రీడా అధికారి నాగరాజు, డీడబ్ల్యువో బ్రహ్మాజీ, డీపీవో సాయిలు, డీఏవో గోవింద్, జెమ్లా నాయక్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.