- ఉన్నతాధికారులకు కొత్త కలెక్టర్ రాజర్షి షా హెచ్చరిక
ఆదిలాబాద్, వెలుగు: పథకాలు అమల్లో కిందిస్థాయి సిబ్బంది తప్పులు చేస్తే సంబంధిత శాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆదిలాబాద్ కొత్త కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. బదిలీపై వచ్చిన ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేయాలని, గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టెన్త్ క్లాస్ పరీక్షల నేపథ్యంలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని డీఈఓను ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో 60 శాతం డెలివరీలు జరుగుతున్నాయని ఆ శాఖ అధికారులు చెప్పగా అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్.. 80 శాతం డెలివరీలు జరిగేలా చూడాలన్నారు.
తహసీల్దార్ ఆఫీస్ తనిఖీ..
జైనథ్ మండలంలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి, ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీని పరిశీలించి దిశా నిర్దేశం చేశారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం సీఎం ప్రారంభించిన రైతు నేస్తం వీడియో కాన్ఫిరెన్స్ లో కలె క్టర్ పాల్గొన్నారు. మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తున్న సోయా కేంద్రాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి పరిశీలించారు. అంతకుముందు బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ కు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ వికాస్ మెహతో స్వాగతం పలికారు.