రాజస్తాన్ ఎన్నికల పోలింగ్‌లో హింసాత్మక ఘటనలు.. ఇద్దరు మృతి

రాజస్తాన్ ఎన్నికల పోలింగ్‌లో హింసాత్మక ఘటనలు.. ఇద్దరు మృతి

రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 70శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటల వరకు 68.24శాతం నమోదైనట్లు వెల్లడించిన అధికారులు.. అప్పటికే క్యూ లైన్లలో ఉన్నవారు ఓటేయడంతో 70 శాతం దాటినట్లు తెలిపారు. అత్యధికంగా అల్వార్‌లోని తిజారాలో 80.85శాతం, అత్యల్పంగా పాలిలోని సుమేర్‌పూర్‌లో 57.81శాతం నమోదైనట్లు వెల్లడించారు. 

మొత్తం 200 సీట్లకుగాను 199 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించారు. కరన్‌పూర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్మీత్‌ సింగ్‌ కూనార్‌ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదాపడింది. ఈ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీగ్ జిల్లాలోని సాల్వర్ గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో పోలీసు సహా నలుగురు గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

ఇద్దరు మృతి

ఓటేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు  గుండె పోటుతో పోలింగ్ కేంద్రాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఒక అభ్యర్థి తరఫు పోలింగ్ ఏజెంట్ కాగా, మరొకరు ఓటరు అని అధికారులు తెలిపారు.

డిసెంబర్ 3న కౌంటింగ్

రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3న జరగనుంది. రాజస్థాన్ సహా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఐదు రాష్ట్రాల పోలింగ్ ముగిసిన అనంతరం ఒకే రోజు(డిసెంబర్ 3) కౌంటింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.