కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తాను అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్నట్లు ..గతంలో కొచ్చిలో రాహుల్ గాంధీని కలిసి చెప్పానన్నారు. అందుకు రాహుల్ గాంధీ కూడా అంగీకరించారన్నారు.
కానీ రాజస్థాన్ సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ..అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. రాజస్థాన్ సీఎంగా కొనసాగుతానే లేదో సోనియాగాంధీకే తెలుసన్నారు.
సోనియాతో భేటీ..
రాజస్థాన్ లో సంక్షోభం నేపథ్యంలో..సీఎం ఆశోక్ గెహ్లాట్..సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఉదయం ఢిల్లీలోని టెన్ జనపథ్కు చేరుకున్న ఆశోక్ గెహ్లాట్..సోనియాగాంధీని కలిసేందుకు వెళ్లారు. మొన్నటి వరకు కాంగ్రెస్ అధ్యక్ష రేసులో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫేవరేట్ అభ్యర్థిగా ఉన్నారు. అయితే రాజస్థాన్ సీఎం పోస్టుపై ఆయన వర్గం తిరుగుబాటు చేశారు. దీనిపై సోనియాగాంధీ సహా ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేతలను అసంతృప్తి వ్యక్తం చేయడంతో..ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం పక్కనపెట్టింది.
అధ్యక్షుడంటే..పీఎంతో సమానం..
71 ఏళ్ల అశోక్ గెహ్లాట్..కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. తన 40 ఏళ్లలో రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. గాంధీ కుటుంబ సభ్యులతో ఆశోక్ గెహ్లాట్కు మంచి సంబంధాలున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ప్రస్తుత రాహుల్ గాంధీ వరకు ఆయన అందరికి దగ్గరగా మెదిలారు. ఈ నేపథ్యంలో తనకు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని సోనియా గాంధీని కోరారు. ఆశోక్ గెహ్లాట్ కోరికను మన్నించిన సోనియా గాంధీ..ఆయన అభ్యర్థనకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ సీఎం పీఠం నుండి అశోక్ గెహ్లాట్ తప్పుకుంటే ఆ స్థానాన్ని సచిన్ పైలట్‌తో భర్తీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఇది ఇష్టం లేని..అశోక్ గెహ్లాట్..తన వర్గం ఎమ్మెల్యేలు 92 మందితో మూకుమ్మడి రాజీనామాలు చేయించారు. దీనిపై సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.