రాజస్థాన్ సీఎం గెహ్లాట్ కుమారుడికి ఈడీ సమన్లు

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌ కు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సమన్లు జారీ చేశారు.  ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కేసులో ఉల్లంఘనలకు సంబంధించి వైభవ్‌కు ఈ సమన్లు అందినట్లు తెలిసింది.  2023 అక్టోబర్  27న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా వైభవ్‌కు ఈడీ తమ నోటీసుల్లో పేర్కొంది.  

ఇక ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ డోటాస్రా, మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నివాసాల్లో ఈడీ  అధికారులు గురువారం ఉదయం నుంచి  తనిఖీలు చేపట్టారు.  మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పేపర్ లీకేజీకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్‌ నేతల ఇళ్లల్లో ఈడీ సోదాలు చేపట్టింది.

Also Read : కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదు: డీకే అరుణ

కాంగ్రెస్‌ నేతల ఇళ్లల్లో ఈడీ సోదాలపై సీఎం  అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.  రాష్ట్రంలో మహిళలు, రైతులు, పేదలు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల ప్రయోజనాలను పొందాలని బీజేపీ కోరుకోవడం లేదు. అందుకే ఇలా ఈడీతో దాడులు చేయిస్తోందన్నారు.  కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ఈడీని ఉపయోగిస్తోందని గెహ్లాట్ ఆరోపించిన రెండు రోజులకే ఈడీ రాజస్థాన్ లో సోదాలు చేపట్టింది.