
రాజస్థాన్ అసెంబ్లీ గత వారం రోజులుగా కాంగ్రెస్ సభ్యుల నిరసనలతో దద్దరిల్లి పోయింది. దాదీ రీమార్క్స్ తొలగించే వరకు పట్టువిడువని కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ (గురువారం, ఫిబ్రవరి 27) అసెంబ్లీ ఎదుట ఆందోళనలతో అధికార పార్టీకి చుక్కలు చూపించింది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఏ ఒక్క రోజూ సభ సజావుగా సాగలేదు. కాంగ్రెస్ సభ్యులు నిరసనలతో అధికార బీజేపీని ఊపిరిపీల్చుకోలేనంత ఒత్తిడికి గురి చేశారు. చివరికి సీఎం దిగొచ్చి కాంగ్రెస్ డిమాండ్ ను అంగీకరించారంటే ఎంత పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు.
గత శుక్రవారం (21 ఫిబ్రవరి) బడ్జెట్ సెషన్ లో.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై అధికార బీజేపీ మంత్రి అవినాశ్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరుతో వర్కింగ్ వుమెన్స్ హాస్టళ్లను గత ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి అవినాశ్ గెహ్లాట్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ‘‘మీరు దాదీ(నాయనమ్మ) పేరు కోసమే హాస్టళ్లు ఏర్పాటు చేశారు’’అని వ్యాఖ్యనించడంతో కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు నిరసనలు ఎక్కడా ఆగలేదు.
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీని అవమానించారని, అసెంబ్లీ నుంచి దాదీ రీమార్క్స్ తొలగించేవరకు ఆందోళన ఆపేది లేదని మొదటి నుంచీ కాంగ్రెస్ సభ్యులు నిరసనలు తెలుపుతూనే వస్తున్నారు. బడ్జెట్ సెషన్స్ లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అయితే కాంగ్రెస్ సభ్యుల ఆందోళనపై అధికార బీజేపీ కూడా బెట్టు చేసినట్లుగా కనిపించింది. కానీ చివరికి దిగొచ్చింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఇవాళ స్పీకర్ తో సమావేశమై.. ఆ వివాదాస్ప వ్యాఖ్యలు తొలగించాలని సూచించారు. దీంతో సభ వ్యవహారాల నుంచి దాదీ వ్యాఖ్యలు తొలగిస్తున్నట్లు స్పీకర్ వాసుదేవ్ దేవ్నానీ ప్రకటించారు. స్పీకర్ ప్రకటనతో కాంగ్రెస్ సభ్యులు శాంతించారు. ఆ తర్వాత బడ్జెట్ కు సంబంధించిన ప్రొసీడింగ్స్ లో పాల్గొన్నారు.
ఆ ఆరుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత:
దాదీ రీమార్క్స్ పై నిరసన తెలిపన ఎమ్మెల్యేలపై ఉన్న సస్పెన్షన్ కూడా ఎత్తివేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలు గోవింద్ సింగ్ మీనా, అమీన్ కాగ్జీ, జకీర్ హుస్సేన్, హకీమ్ అలీ, సంజయ్ కుమార్ జాతవ్ లు అసెంబ్లీ చర్చలో పాల్గొన్నారు. గత శుక్రవారం సస్పెండ్ చేయడంతో ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే రాత్రంతా నిద్రించి నిరసన కొనసాగించిన విషయం తెలిసిందే.