వ్యవసాయం చేసే రైతుకు నెలకు మహా అంటే 2 వేలు బిల్లు వస్తుంది. కానీ, రాజస్థాన్‌లోని ఒక రైతుకు మాత్రం రెండు నెలలకు కలిపి రూ. 3.71 కోట్ల బిల్లు వచ్చింది. అది చూసిన రైతుకు గుండె ఆగినంత పని అయింది. ఉదయపూర్‌లోని జింగ్లా గ్రామానికి చెందిన పెమారామ్ పటేల్ అనే వ్యక్తికి జూన్ మరియు జూలై నెలలకు సంబంధించి 38,514,098 యూనిట్లు వాడాడని.. అందుకు గాను రూ. 3,71,61,507 కోట్ల రూపాయల బిల్లును పంపించారు. ఈ బిల్లును అజ్మీర్ విద్యూత్ విత్రాన్ నిగం లిమిటెడ్ (అజ్మీర్ డిస్కమ్) ఆగష్టు 22న జారీ చేసింది. ఈ బిల్లును సెప్టెంబర్ 3వ తేదీలోపు చెల్లించాలని.. లేకపోతే లేట్ ఫీజు కింద మరో రూ. 7.16 లక్షలు కట్టాల్సి వస్తుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. అది చూసిన పెమారామ్ వెంటనే అధికారులను కలిశాడు. ప్రింటింగ్ పొరపాటు కారణంగానే బిల్లు ఇలా వచ్చిందని అధికారులు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నాడు. పెమారామ్ ఈ-మిత్రా కార్యాలయానికి వెళ్లి తన సర్వీస్ నెంబర్‌తో చెక్ చేయగా.. అసలు బిల్లు రూ. 6, 414అని తేలింది.
అజ్మీర్ డిస్కమ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గిరీష్ జోషి మాట్లాడుతూ.. మీటర్ రీడింగులను రికార్డ్ చేసే ఆపరేటర్ తప్పు వల్లే ఈ పొరపాటు జరిగింది. వినియోగదారుడి ఫిర్యాదు మేరకు వెంటనే పాత బిల్లు స్థానంలో కొత్తది ఇచ్చాం’ అని ఆయన అన్నారు. ఈ బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.