హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు కాజేసేందుకు రోజుకో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఏ రూపంలో ఎక్కడి నుంచి డబ్బు కాజేస్తారో అర్థం కావట్లేదు. లేటెస్ట్ గా యూపీఐ పేమెంట్స్ ద్వారా 4 కోట్లు కొల్లగొట్టిన అంతరాష్ట్ర కేటుగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా హైదరాబాద్ లో ముఠాగా ఏర్పడి కోట్లు కాజేస్తున్నారు. నిందితుల నుంచి రూ. కోటి 72 లక్షల నగదు 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శంషాబాద్ సీసీఎస్, కేపీహెచ్బీ మాదాపూర్, నార్సింగి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు .
బజాజ్ ఎలక్ట్రానిక్స్ ను టార్గెట్ గా చేసుకొని రాజస్థాన్ ముఠా యూపీఐ మోసాలకు పాల్పడుతోంది. మూడు కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల రూపాయల యూపీఐ మోసాలకు పాల్పడింది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ పిర్యాదు మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మోసం చేయడానికి ముందు ముఠా సభ్యులు కస్టమర్లుగా ఎలక్ట్రానిక్ షో రూమ్ లకు వెళ్తారు. వస్తువులు కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి క్యూఆర్ కోడ్ ను రాజస్థాన్ సహచరులకు పంపుతారు. వస్తువులు డెలివరీ అయ్యాక పొరపాటున తప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటూ బ్యాంకును ఆశ్రయిస్తున్నారు. బ్యాంకు ఆదేశాలతో చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొందుతుంది ముఠా.
Also Read :- 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను మా చేతిల పెట్టిండు
రాజస్థాన్ కు చెందిన 20 నుండి 25 ఏళ్ల వయసు ఉన్న యువకులంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. యూపీఐ మోసాల ద్వారా కొనుగోలు చేసిన వస్తువులను ఇతరులకు అమ్మి ఈ ముఠా సొమ్ము చేసుకుంటుంది. నిందితులపై మూడు కమీషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. సైబరాబాద్ లో ఆరు,రాచకొండలో రెండు, హైద్రాబాద్ లో ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్ షో రూమ్ లో మోసాలకు పాల్పడింది ముఠా. గత రెండు మూడు నెలల నుంచి బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో 1127 లావాదేవీలు జరిపారు నిందితులు. మొత్తం 1.56 కోట్ల రూపాయలు తిరిగి వాళ్ళ అకౌంట్ లోకి తిరిగి పొందారు.