రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో దుండుగల చేతిలో దారుణహత్యకు గురైన టైలర్ కన్హయ్య లాల్ కుమారులకు రాజస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది. కన్హయ్య లాల్ తేలి కుమారులైన యశ్ తేలి, తరుణ్ తేలిలను ప్రభుత్వ ఉద్యోగంలో నియమిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి మమతా భూపేశ్ మీడియాకు తెలిపారు. రాజస్థాన్ సబార్డినేట్ ఆఫీస్ క్లర్క్ సర్వీస్ (సవరణ) రూల్స్ 2008, 2009లోని రూల్ 6సి ప్రకారం ఈ నియామకాలు జరుపుతున్నట్టుగా ఆమె తెలిపారు. కన్హయ్య లాల్ సంపాదన పైనే ఆయన కుటుంబం ఆధారపడి ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు కన్హయ్య లాల్ మద్దతు పలకడంతో ఇద్దరు వ్యక్తులు అతన్ని హత్య చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.