రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల ఇందిరా గాంధీ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని (ఐజీయూఈజీఎస్) తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని కార్మికులకు రోజుకు రూ. 259 చొప్పున ఏడాదిలో 125 రోజులపాటు పని కల్పిస్తారు. ఏ పనీ చేయలేని వారికి ప్రభుత్వం నెలకు రూ.1000 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్ తో అత్యధిక సంఖ్యలో గ్రామీణులు పట్టణాలకు వలస వెళ్లొచ్చు. ఫలితంగా, పట్టణ ప్రాంతాలకు వలసను తగ్గించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రయోజనం దెబ్బతింటుంది. గ్రామీణులు పొట్ట చేతపట్టుకుని నగరాలకు రావడమంటే మంచినీరు, విద్యుత్ సదుపాయం లేని మురికివాడలు శివారు ప్రాంతాల్లో మరిన్ని వెలుస్తాయి. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాలకు ఆకర్షితులై లక్షలాది మంది పట్టణాలకు చేరుకుంటే వారికి కనీస సదుపాయాల కల్పన ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారొచ్చు.
పట్టణాల్లో ఉత్పాదక సృష్టి ఎలా?
పట్టణ ప్రాంతాల్లో వేతనాలను దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం ప్రకారం నిర్ణయించాలి. ఆ చట్టంలోని నిబంధనలు హెచ్చు వేతన స్థాయిలను నిర్దేశిస్తాయి. ఢిల్లీలో కనీస నెలసరి వేతనం రూ.17,234గా ఉంది. అంటే, నెలలో 26 రోజుల్లో రోజుకు రూ. 770 చొప్పున చెల్లించాలి. రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కనీస వేతనం ఒకే విధంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో జీవన వ్యయం ఎక్కువ కాబట్టి పట్టణాలకు గ్రామీణులు రాకపోవచ్చు. పట్టణాల్లో అదనపు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి వలసలు మొదలవనూ వచ్చు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద భూమిని చదును చేయడం, కట్టలు నిర్మించడం వంటి మూలధన ఆస్తుల సృష్టి జరగాలి.
ఉత్పాదకతను పెంచే పనులు చేపట్టాలి. పట్టణ ప్రాంతాల ఉపాధి హామీ పథకం కింద అలాంటి మూలధన ఆస్తులను ఎలా సృష్టిస్తారో స్పష్టత లేదు. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణాలకు నిపుణులైన కార్మికులు నిలకడగా అందుబాటులో ఉండాలి. ఇదీగాక, 2003 నాటి బడ్జెట్ నిర్వహణ చట్టం మితిమీరిన ఖర్చులు చేయవద్దని రాష్ట్రాలకు సూచిస్తున్నది. ఆ చట్టం ప్రకారం, ప్రతి రాష్ట్ర రుణ/స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) నిష్పత్తి 20 శాతం మించకూడదు. రాజస్థాన్ విషయంలో 2022–23 ఏడాదికి గాను ఆ నిష్పత్తి దానికి రెట్టింపుగా దాదాపు 39.8 శాతంగా ఉంది. కొత్తగా పెట్టిన పథకంతో రాజస్థాన్ రుణ భారం ఇంకా పెరగవచ్చు. దివ్యాంగులు, వృద్ధులకిస్తున్న పెన్షన్ భారం ఏటా15 శాతం చొప్పున పెరుగుతూపోతోంది. రాబడిలో నాల్గవ వంతు భాగం వడ్డీ చెల్లింపులకే పోతోంది. ఇక స్థిరమైన ఉద్యోగావకాశాలు కల్పించే వాటిపై పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రాల వద్ద నిధులు ఎక్కడ నుంచి ఉంటాయి?
ఇతర రాష్ట్రాలూ అదే దారిలో...
కేరళలో అయ్యంకళి పట్టణ ఉపాధి హామీ పథకం ఉంది. ఒడిశాలో ‘ఉన్నతి’ కింద అర్బన్ వేజ్ ఎంప్లాయ్ మెంట్ ఇనీషియేటివ్ పథకం ఉంది. జార్ఖండ్ లో ముఖ్యమంత్రి శ్రామిక యోజన అమలవుతోంది. మధ్య ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజన అమలవుతోంది. తమిళనాడులో తమిళనాడు అర్బన్ ఎంప్లాయ్ మెంట్ స్కీమ్ అమలవుతోంది. పార్కులు, కమ్యూనిటీ సెంటర్లు, ఇతర మౌలిక సదుపాయాల వంటి ప్రభుత్వ ఆస్తుల కల్పన, నిర్వహణకు18 ఏండ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉన్నవారికి ఉపాధి కల్పిస్తున్నారు. వీటిలో కొన్ని పథకాలు ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నవి కూడా ఉన్నాయి. నిరుద్యోగం సమస్య కాదని, దాన్ని పరిష్కరించే ప్రయత్నాలు జరగకూడదని ఎవరూ అనరు. కానీ, ఆ ప్రయత్నాలు శాశ్వత ప్రాతిపదికన చేపట్టేవిగా ఉండాలి.
వ్యవసాయమే ఆదుకుంటోంది
ఉపాధి అవకాశాలు చూపడంలో అంతో ఇంతో వ్యవసాయ రంగమే ముందుంది. కేంద్ర ప్రభుత్వ 2021–22 సంవత్సరపు ఉపాధి నివేదిక 45.5 శాతం శ్రామిక వర్గం వ్యవసాయ రంగంలోనే ఉన్నట్లు పేర్కొంది. ఈ లెక్కన కరోనా ముందు కన్నా ఎక్కువగా వ్యవసాయ రంగం ఉపాధి కల్పిస్తోంది. దేశ జనాభాలో అత్యధిక శాతం మంది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. స్థూల ఆర్థిక సుస్థిరతపై రాజీపడకుండా ఆర్థిక వృద్ధి కొనసాగేటట్లు చూడడంలో మోదీ ప్రభుత్వం కనబరుస్తున్న లాఘవం ప్రశంసార్హమైనది. అప్పులు చేయకపోవడం, అనవసర ఖర్చులకు వెళ్లకపోవడం, కుంభకోణాలకు తెరదించడం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అంశాలు. ఆర్థిక వృద్ధికి ఇవి నిలకడ చేకూరుస్తున్న అంశాలు.
‘పురా’ ఏమైంది?
పట్టణ ప్రాంతాలకు వలసలను తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో కనబడే సదుపాయాలు నిర్మించాలని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూచించారు. ఆ భావన ప్రొవైడింగ్ అర్బన్ ఎమెంటిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ కు ఆయన ‘పురా’ అని పేరు పెట్టారు. కేంద్ర, రాష్ట్రాలు మొదట్లో దానిపై శ్రద్ధ చూపాయి. కానీ, తరువాత వదిలేశాయి. కలాం చెప్పిన ‘నాలెడ్జ్ కనెక్టివిటీ’ని పక్కన పెట్టి తాగునీరు, పారిశుధ్యం వంటి వాటికే ప్రాధాన్యమిస్తూ వచ్చారు.‘పురా’ పేరు మార్చుకుని కొన్ని చోట్ల ఇతర పేర్లతో అక్కడక్కడ అమలు చేస్తున్నారు. క్రితం దశాబ్దంతో పోలిస్తే అర్బన్ సెటిల్ మెంట్లు విపరీతంగా పెరిగాయని 2011 నాటి జనాభా లెక్కల సేకరణ వెల్లడించింది. నగరాల్లో కొత్తగా ఏర్పడిన శ్రామికవాడలు 7,933 వరకు ఉన్నాయని పేర్కొంది. తర్వాత, వాటి సంఖ్య ఇంకా పెరిగి ఉండొచ్చు. వాటిలో 65 శాతం వాడలకు మాస్టర్ ప్లాన్ ఏమీ లేదని నీతి ఆయోగ్ 2021 నివేదికలో పేర్కొంది.
- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్ జర్నలిస్ట్