21 వరకూ వారిపై చర్యలొద్దన్న రాజస్థాన్ హైకోర్టు
తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
సీఎం అవినీతిపైనే గొంతెత్తానని పైలట్ వెల్లడి
ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర: కాంగ్రెస్
ఆడియో టేపుల దుమారం
జైపూర్: రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, 18 మంది రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్వల్ప ఊరట లభించింది. డిస్ క్వాలిఫికేషన్కు సంబంధించి వారిపై మంగళవారం సాయంత్రం వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అసెంబ్లీ స్పీకర్ను రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
నోటీసులు చట్టవిరుద్ధం: పైలట్ క్యాంప్
స్పీకర్ జారీ చేసిన డిస్ క్వాలిఫికేషన్ నోటీసులపై సచిన్ పైలట్తోపాటు 18 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ల డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. 19 మంది ఎమ్మెల్యేలపై 21వ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్కు సూచించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకూ స్పీకర్ ఎలాంటి ఆర్డర్ జారీ చేయరని ఆయన తరఫు అడ్వొకేట్ కోర్టుకు హామీ ఇచ్చారు. దీంతో పైలట్ క్యాంపు ఎమ్మెల్యేలకు 4 రోజుల పాటు రిలీఫ్ లభించినట్లయ్యింది. పైలట్, రెబెల్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ అడ్వొకేట్లు హరీశ్సాల్వే, ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ తరఫున అభిషేక్ మను సంఘ్వీ హాజరయ్యారు. కాగా, పార్టీ విప్ ఉల్లంఘించిన కారణంగా ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయాలన్న కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషనర్ల తరఫున హరీశ్ సాల్వే, రోహత్గీ వాదనలు వినిపించారు. అసెంబ్లీ సమావేశమైనప్పుడు మాత్రమే విప్ వర్తిస్తుందన్నారు. వారు అసంతృప్తితో ఉన్నారని, వారికి రిలీఫ్ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. శనివారం నాటికి పిటిషనర్ల పిటిషన్పై రెస్పాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మహేశ్ జోషికి సూచించింది.
కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌పై ఎఫ్‌ఐఆర్
గెహ్లట్ సర్కార్ను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ రెండు ఆడియో టేప్లను రిలీజ్ చేయడం కలకలం రేపింది. ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలనే, ఎమ్మెల్యేలను ఎలా కొనాలనే దానిపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, వ్యాపారవేత్త సంజయ్ జైన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్లాల్శర్మ మాట్లాడుకుంటున్నట్టుగా ఈ ఆడియో టేపులు ఉన్నాయి. సర్కారును కూల్చడానికి షెకావత్ కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనికి సంబంధించి స్పెషల్ ఆపరేషన్ గ్రూపునకు కంప్లయింట్ చేసింది. కాంగ్రెస్ ఫిర్యాదుతో పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. ఒక దాంట్లో కేంద్ర మంత్రి షెకావత్ పేరు కూడా ఉంది. ఈ కేసులకు సంబంధించి సంజయ్జైన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భన్వర్లాల్శర్మతోపాటు మరో రెబెల్ ఎమ్మెల్యే విశ్వేంద్రసింగ్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. వీరిద్దరూ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీతో కలిసి కుట్రపన్నారని ఆరోపించింది. వారిద్దరికీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. మధ్యప్రదేశ్, గోవా, అరుణాచల్ప్రదేశ్, కర్ణాటకల్లో చేసినట్టే రాజస్థాన్లోనూ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత సూర్జేవాల్ విమర్శించారు. పైలట్ బీజేపీకి ఎమ్మెల్యేల లిస్ట్ ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలను షెకావత్ ఖండించారు. అది తన వాయిస్ కాదని, అది ఫేక్ ఆడియో టేప్ అని చెప్పారు. మరోవైపు, ఢిల్లీకి దగ్గర్లోని మనేసర్లోని రెండు రిసార్ట్స్లో క్యాంప్ వేసిన రెబెల్ ఎమ్మెల్యేల దగ్గరికి రాజస్థాన్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. భన్వరిలాల్ శర్మ గురించే వారు వెళ్లినట్టు సమాచారం.
నేను ప్రభుత్వాన్ని కూల్చినా.. నా లిమిట్స్ దాటినా అది పాపం చేయడమే. కానీ నేను సీఎం అవినీతికి వ్యతిరేకంగా పెదవి విప్పాను. ఆయనను పదవి నుంచి తొలగించాలని పార్టీలో ఉండే డిమాండ్ చేశాను. భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని కూల్చడానికి నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
– కోర్టుకు పైలట్ వివరణ
For More News..