ట్రాక్టర్​తో తొక్కించి తమ్ముడి హత్య

ట్రాక్టర్​తో తొక్కించి తమ్ముడి హత్య
  • ట్రాక్టర్​తో తొక్కించి తమ్ముడి హత్య
  • రాజస్థాన్​లోని భరత్​పూర్​లో ఘటన
  • రెండు కుటుంబాల మధ్య భూ వివాదమే కారణం

న్యూఢిల్లీ: భూమిపై యాజమాన్య హక్కుల విషయంలో రెండు కుటుంబాల మధ్య మొదలైన గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. రాళ్లతో, కర్రలతో కొట్టుకున్నారు. ఆపై వరుసకు తమ్ముడయ్యే వ్యక్తిని ఓయువకుడు ట్రాక్టర్​తో తొక్కించి చంపేశాడు. రాజస్థాన్​లోని భరత్​పూర్​లో బుధవారం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

రెండు కుటుంబాల మధ్య లొల్లి..

భరత్​పూర్​లోని భూమి విషయంలో బహదూర్ సింగ్, అథర్ సింగ్ కుటుంబాల మధ్య ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. రెండు కుటుంబాలు గతంలో పలుమార్లు గొడవపడ్డాయి. ఇదే విషయంపై బుధవారం మరోసారి పంచాయితీ మొదలైంది. బహదూర్ సింగ్ కుటుంబం ట్రాక్టర్ పై రాగా, ఆ తర్వాత అథర్ సింగ్ కుటుంబం స్పాట్​కు చేరుకుంది. ఆపై కొద్దిసేపట్లోనే గొడవ మొదలైంది. 

ఇరువర్గాల వారు కొట్టుకున్నారు. ఈ గొడవలో అథర్ సింగ్​ కొడుకు నిర్పత్ కిందపడగా.. దామోదర్ సింగ్ ట్రాక్టర్ ను తమ్ముడిపైకి తోలాడు. వెనుకకు ముందుకు వెళుతూ ఎనిమిది సార్లు నిర్పత్ పైకి ట్రాక్టర్ ను ఎక్కించాడు. మిగతా వాళ్లు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగలేదు. తీవ్ర గాయాలతో నిర్పత్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. 

విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన 10 మందికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఐదురోజుల కింద కూడా ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిందని, అప్పుడు బహదూర్ సింగ్ ఫ్యామిలీపై అథర్ సింగ్ కుటుంబం కేసు పెట్టిందని చెప్పారు.