బ్రాండెడ్ ​అంటూ నకిలీ వైర్లు విక్రయం.. రాజస్థాన్ వ్యాపారి అరెస్ట్

  • ట్రూప్​ బజార్​లో రాజస్థాన్ వ్యాపారి అరెస్ట్
  • రూ.15 లక్షల వైర్లు సీజ్

బషీర్ బాగ్, వెలుగు: బ్రాండెడ్ పేరుతో నకిలీ కరెంట్ వైర్లను విక్రయిస్తున్న వ్యాపారిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్​చేశారు. రాజస్థాన్​కు చెందిన శంభు సింగ్(30) రోజూ అబిడ్స్ రామకృష్ణ థియేటర్ వెనుక వైపు బైక్ నిలిపి రోడ్డుపైనే కరెంట్​వైర్లు విక్రయిస్తున్నాడు. ట్రూప్ బజార్ లోని షాపులకు వచ్చే కస్టమర్లను మభ్యపెట్టి, ఫినోలెక్స్, పాలీ క్లబ్​వంటి బ్రాండ్ల పేర్లతో నకిలీ వైర్లను అంటగడుతున్నాడు.

విషయం తెలుసుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం ట్రూప్ బజార్ మార్కెట్ లో నిఘాపెట్టి శంభు సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.  రూ.15 లక్షలు విలువ చేసే వైర్ బండిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం శంభు సింగ్ ను అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.