రాజస్తాన్‌‌ రాయల్‌‌గా.. ఐపీఎల్‌‌ క్వాలిఫయర్‌‌-2కు అర్హత

రాజస్తాన్‌‌ రాయల్‌‌గా.. ఐపీఎల్‌‌ క్వాలిఫయర్‌‌-2కు అర్హత
  • ఎలిమినేటర్‌‌లో బెంగళూరుపై4 వికెట్ల తేడాతో గెలుపు
  • రాణించిన జైస్వాల్‌‌, పరాగ్‌‌, ఆవేశ్‌‌ ఖాన్‌‌ 
  • కోహ్లీ, పటీదార్‌‌ పోరాటం వృథా

అహ్మదాబాద్‌‌: ఐపీఎల్‌‌ టైటిల్‌‌ గెలవాలన్న బెంగళూరు కలలకు రాజస్తాన్‌‌ చెక్‌‌ పెట్టింది. యశస్వి జైస్వాల్‌‌ (30 బాల్స్‌‌లో 8 ఫోర్లతో 45), రియాన్‌‌ పరాగ్‌‌ (26 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 36) నిలకడైన బ్యాటింగ్‌‌కు తోడు ఆవేశ్‌‌ ఖాన్‌‌ (3/44) కీలక వికెట్లు తీయడంతో.. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌‌ మ్యాచ్‌‌లో రాయల్స్‌‌ 4 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. తద్వారా హైదరాబాద్‌‌తో క్వాలిఫయర్‌‌–2కు అర్హత సాధించింది. టాస్‌‌ ఓడిన రాజస్తాన్‌‌ ఫీల్డింగ్‌‌ ఎంచుకోగా, బ్యాటింగ్‌‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 172/8 స్కోరు చేసింది.  రజత్‌‌ పటీదార్‌‌ (22 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 34), విరాట్‌‌ కోహ్లీ (24 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 33), మహిపాల్‌‌ లోమ్రోర్‌‌ (17 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 32) రాణించారు. తర్వాత రాజస్తాన్‌‌ 19 ఓవర్లలో 174/6 స్కోరు చేసింది. అశ్విన్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.
 
ముగ్గురు మెరుగ్గా..

ఆర్‌‌సీబీ ఇన్నింగ్స్‌‌ను స్టార్టింగ్‌‌లో బౌల్ట్‌‌ (1/16) కట్టడి చేసినా.. రెండో ఎండ్‌‌లో మిగతా బౌలర్లు తడబడటంతో బెంగళూరు మంచి స్కోరు సాధించింది. చివర్లో ఆవేశ్‌‌ ఖాన్‌‌ కీలక వికెట్లు తీశాడు. ఓపెనింగ్‌‌లో కోహ్లీ మెల్లగా ఆడితే డుప్లెసిస్‌‌ (17) రెండో ఓవర్‌‌లోనే సిక్స్‌‌తో బాదుడు షురూ చేశాడు. 4వ ఓవర్‌‌లో కోహ్లీ సిక్స్‌‌, డుప్లెసిస్‌‌ రెండు ఫోర్లతో స్కోరు బోర్డులో వేగం పెంచారు. కానీ ఐదో ఓవర్‌‌లో బౌల్ట్‌‌.. డుప్లెసిస్‌‌ను ఔట్‌‌ చేసి ఫస్ట్‌‌ వికెట్‌‌కు 37 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ చేశాడు. ఆ వెంటనే కోహ్లీ రెండు ఫోర్లతో పవర్‌‌ప్లేలో ఆర్‌‌సీబీ 50/1 స్కోరు చేసింది.

అశ్విన్‌‌ (2/19) రాకతో రన్స్‌‌ తగ్గినా ఏడో ఓవర్‌‌లో చహల్‌‌ (1/43) కీలకమైన విరాట్‌‌ వికెట్‌‌ తీసి బెంగళూరుకు షాకిచ్చాడు. పటీదార్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ను గట్టెక్కించే బాధ్యత తీసుకున్న కామెరూన్‌‌ గ్రీన్‌‌ (27) 10వ ఓవర్‌‌లో 6, 4తో బ్యాట్‌‌ ఝుళిపించడంతో స్కోరు 76/2కు పెరిగింది. ఈ ఇద్దరు క్రమంగా రన్‌‌రేట్‌‌ పెంచే ప్రయత్నం చేసినా 13వ ఓవర్‌‌లో అశ్విన్‌‌ డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. వరుస బాల్స్‌‌లో గ్రీన్‌‌, మ్యాక్స్‌‌వెల్‌‌ (0)ను పెవిలియన్‌‌కు పంపాడు. మూడో వికెట్‌‌కు 41 రన్స్‌‌ జతయ్యాయి. ఈ దశలో వచ్చిన మహిపాల్‌‌ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

14వ ఓవర్‌‌లో పటీదార్‌‌ 6, 4, మహిపాల్‌‌ 6 కొట్టడంతో 19 రన్స్‌‌ వచ్చాయి. అదే జోరులో తర్వాతి ఓవర్‌‌లో మరో సిక్స్‌‌ కొట్టిన పటీదార్‌‌ను ఆవేశ్‌‌ ఖాన్‌‌ దెబ్బ కొట్టాడు. ఫలితంగా ఐదో వికెట్‌‌కు 25 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది.  మహిపాల్‌‌తో కలిసిన దినేశ్‌‌ కార్తీక్‌‌ (11) పవర్‌‌ హిట్టింగ్‌‌ చేయలేకపోయాడు. కానీ సింగిల్స్‌‌తో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేసి ఆరో వికెట్‌‌కు 32 రన్స్‌‌ జత చేశాడు. 19వ ఓవర్‌‌లో ఆవేశ్‌‌ నాలుగు బాల్స్‌‌ తేడాలో ఈ ఇద్దర్ని ఔట్‌‌ చేసినా, చివర్లో స్వప్నిల్‌‌ సింగ్‌‌ (9 నాటౌట్‌‌), కర్న్‌‌ శర్మ (5) ఫర్వాలేదనిపించారు.  పావెల్‌‌ నాలుగు క్యాచ్‌‌లు అందుకోవడం విశేషం. 

జైస్వాల్‌‌, పరాగ్‌‌ దూకుడు..

భారీ ఛేదనను రాజస్తాన్‌‌ కూడా మెరుగ్గానే ఆరంభించింది. తొలి రెండు ఓవర్లలో ఆరు రన్సే వచ్చినా, మూడో ఓవర్‌‌లో క్యాచ్‌‌ ఔట్‌‌ నుంచి బయటపడ్డ జైస్వాల్‌‌ ఆ తర్వాత ఫోర్లతో రెచ్చిపోయాడు. రెండో ఎండ్‌‌లో కాడ్‌‌మోర్‌‌ (20) కూడా బౌండ్రీలు బాదాడు. ఈ క్రమంలో ఐదో ఓవర్‌‌లో కాడ్‌‌మోర్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను మాక్స్‌‌వెల్‌‌ జారవిడిచాడు.  అయితే ఆరో ఓవర్‌‌లో బౌలింగ్‌‌కు దిగిన ఫెర్గుసన్‌‌ (1/37) ఓ సూపర్‌‌ ఇన్‌‌ స్వింగర్‌‌తో కాడ్‌‌మోర్‌‌ను ఔట్‌‌ చేసి తొలి వికెట్‌‌కు 46 రన్స్‌‌ను బ్రేక్‌‌ చేశాడు.

పవర్‌‌ప్లేలో రాయల్స్‌‌47/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌‌లో శాంసన్‌‌ (17) సిక్స్‌‌, జైస్వాల్‌‌ రెండు ఫోర్లతో 17 రన్స్‌‌ రాబట్టారు. దీంతో పాటు వీలైనంత వేగంగా సింగిల్స్‌‌, డబుల్స్‌‌ తీసి రన్‌‌రేట్‌‌ను కాపాడారు.  సాఫీగా సాగుతున్న రాయల్స్‌‌ ఇన్నింగ్స్‌‌కు 10, 11వ ఓవర్లలో ఝలక్‌‌ తగిలింది. ముందుగా జైస్వాల్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను సూపర్‌‌గా అందుకున్న కార్తీక్‌‌, ఆ వెంటనే శాంసన్‌‌ను స్టంపౌట్‌‌ చేశాడు. 

రెండో వికెట్‌‌కు 35 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. 86/3తో కష్టాల్లో పడిన రాయల్స్‌‌ ఇన్నింగ్స్‌‌ను ధ్రువ్‌‌ జురెల్‌‌ (8), రియాన్‌‌ పరాగ్‌‌ నిలబెట్టే ప్రయత్నం చేయడంతో 12 ఓవర్లలో స్కోరు వందకు చేరింది. అయితే 14వ ఓవర్‌‌లో జురెల్‌‌ను కోహ్లీ, గ్రీన్‌‌ అద్భుతంగా రనౌట్‌‌ చేయడంతో రాయల్స్‌‌ ఇన్నింగ్స్‌‌ మళ్లీ తడబడింది. కానీ పరాగ్‌‌, హెట్‌‌మయర్‌‌ (26) వదల్లేదు. 16వ ఓవర్‌‌లో పరాగ్‌‌ 6, 6, 4తో 17 రన్స్‌‌ రాబట్టాడు. ఇక 24 బాల్స్‌‌లో 30 రన్స్‌‌ అవసరమైన దశలో హెట్‌‌మయర్‌‌ 4, 4 కొట్టగా, 18వ ఓవర్‌‌లో సిరాజ్‌‌ (2/33) డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. ఐదు బాల్స్‌‌ తేడాలో పరాగ్‌‌, హెట్‌‌మయర్‌‌ను ఔట్‌‌ చేయడంతో ఉత్కంఠ మొదలైంది. 12 బాల్స్‌‌లో 13 రన్స్‌‌ కావాల్సి ఉండగా, పావెల్‌‌ (16 నాటౌట్‌‌) 4, 4, 6తో మరో ఓవర్‌‌ మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు


బెంగళూరు: 20 ఓవర్లలో 172/8 (రజత్‌‌ 34, కోహ్లీ 33, మహిపాల్‌‌ 32, ఆవేశ్‌‌ ఖాన్‌‌ 3/44).

రాజస్తాన్‌‌: 19 ఓవర్లలో 174/6 (జైస్వాల్‌‌ 45, పరాగ్‌‌ 36, సిరాజ్‌‌ 2/33).