IPL 2025: సారధిగా సంజు శాంసన్ ఔట్.. కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన రాజస్థాన్‌ రాయల్స్

IPL 2025: సారధిగా సంజు శాంసన్ ఔట్.. కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన రాజస్థాన్‌ రాయల్స్

ఐపీఎల్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరో అధికారిక ప్రకటన చేసింది. తొలి మూడు మ్యాచ్ లకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ వ్యవహరిస్తారని ప్రకటించింది. గాయంతో సంజు శాంసన్ ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. శాంసన్ పూర్తిగా కోలుకునే వరకు పరాగ్ రాజస్థాన్ జట్టును నడిపిస్తాడు. బ్యాటింగ్‌కు చేయడానికి సంజు ఫిట్ గా ఉన్నప్పటికీ వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టడానికి సిద్ధంగా లేడని తెలుస్తుంది. 

బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి  సంజు శాంసన్ కు పూర్తి స్థాయిలో వికెట్ కీపింగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో అతను  పూర్తి ఫిట్ నెస్ సాధించేవరకు కేవలం బ్యాటర్ గానే అందుబాటులోనే ఉండనున్నాడు. దీని ప్రకారం ఈ సీజన్ లో ప్రారంభ మ్యాచ్ లకు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరి సోమవారం(మార్చి 17) ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యాడు. 

సంజు శాంసన్ కెప్టెన్ గా దూరం కావడంతో రాజస్థాన్ రాయల్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాటర్ ఇలా మూడు విభాగాల్లో సంజు సమర్ధుడు. అతని స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు. మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. మార్చి 26న కోల్ కతా నైట్ రైడర్స్ తో.. మార్చి 30న  చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్ లకు సంజు కెప్టెన్ గా దూరం కానున్నాడు.  

ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో గాయపడ్డాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్  సందర్భంగా అతను గాయపడ్డాడు. ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఎక్స్‌ప్రెస్ డెలివరీ శాంసన్ చూపుడు వేలికి బలంగా తగిలింది. దీంతో రక్తస్రావం కూడా జరిగింది. ఫిజియో చికిత్స పొందిన తర్వాత సంజు బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ ఆ తర్వాత ఓవర్లోనే బిగ్ షాట్ కు ప్రయతించి ఔటయ్యాడు. శాంసన్ ఇటీవలే తన వేలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్ సమయానికి పూర్తిగా కోలుకుంటాడని భావించినా అది జరగలేదు. దీంతో శాంసన్ లేకుండగానే రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్ ల్లో బరిలోకి దిగుతుంది.