- దంచికొట్టిన రియాన్ పరాగ్, అశ్విన్
- వార్నర్, స్టబ్స్ పోరాటం వృథా
జైపూర్ : చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయంతో గట్టెక్కింది. ఢిల్లీ విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 60 రన్స్ కావాల్సిన దశలో ట్రిస్టాన్ స్టబ్స్ (23 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44*) దంచికొట్టినా, చివరి ఓవర్‌లో 12 రన్స్ రాబట్టలేకపోయాడు. దీంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్ 12 రన్స్ తేడాతో ఢిల్లీకి చెక్ పెట్టింది. టాస్ ఓడిన రాజస్తాన్ 20 ఓవర్లలో 185/5 స్కోరు చేసింది.
రియాన్ పరాగ్ (45 బాల్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84*), అశ్విన్ (29) మెరుగ్గా ఆడారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 173/5 స్కోరుకే పరిమితమైంది. డేవిడ్ వార్నర్ (49) మెరుపు ఆరంభాన్నివ్వగా, స్టబ్స్ చివరి వరకు పోరాడాడు. పరాగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
వార్నర్, స్టబ్స్ మెరుపులు..
ఛేజింగ్‌లో ఢిల్లీకి మంచి ఆరంభమే దక్కింది. మిచెల్ మార్ష్ (23) బౌండ్రీలకు తోడు వార్నర్ నిలకడగా ఆడటంతో మూడు ఓవర్లలోనే 30 రన్స్ వచ్చాయి. కానీ 4వ ఓవర్‌లో బర్గర్ (2/29) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మూడు బాల్స్ తేడాలో మార్ష్, రికీ భుయ్ (0)ను ఔట్ చేశాడు. దీంతో స్కోరు 30/2గా మారింది. ఈ దశలో వార్నర్ 4, 6, 6, 4, 6 దంచడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 59/2 స్కోరు చేసింది. రిషబ్ పంత్ (28) సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసినా 10వ ఓవర్‌లో భారీ సిక్సర్‌తో జోరు పెంచాడు. మధ్యలో వార్నర్ మరో రెండు ఫోర్లు కొట్టడంతో ఫస్ట్ టెన్‌లో డీసీ స్కోరు 89/2కి పెరిగింది.
ఫుల్ ఫామ్‌తో ఆడుతున్న వార్నర్‌ను 12వ ఓవర్‌లో అవేశ్ ఖాన్ (1/29) దెబ్బకొట్టడంతో మూడో వికెట్‌కు 67 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. 14, 16వ ఓవర్లలో చహల్ (2/19) వరుసగా పంత్, అభిషేక్ పోరెల్ (9) వికెట్లు తీయడంతో ఢిల్లీ 122కే సగం జట్టును కోల్పోయింది. చివరి 4 ఓవర్లలో 60 రన్స్ కావాల్సిన దశలో ట్రిస్టాన్ స్టబ్స్ 6, 6, 6, 4, అక్షర్ పటేల్ (15*) 4 చెలరేగినా ఢిల్లీ విజయానికి కొద్ది దూరంలో ఆగిపోయింది.
పరాగ్ ఒక్కడే..
ఆరంభంలో రాజస్తాన్ బ్యాటర్లను కట్టడి చేసిన ఢిల్లీ బౌలర్లు చివర్లో భారీ రన్స్ ఇచ్చారు. రియాన్ పరాగ్ ఒంటరి పోరాటానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. దీంతో రాజస్తాన్ భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. 2, 6, 8వ ఓవర్లలో వరుసగా యశస్వి జైస్వాల్ (5), సంజూ శాంసన్ (15), జోస్ బట్లర్ (11) ఔట్‌కావడంతో రాయల్స్ 36/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో రియాన్ దీటుగా ఆడాడు. ముందుగా సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా భారీ షాట్లతో రెచ్చిపోయాడు. రెండో ఎండ్‌లో సిక్స్‌తో టచ్‌లోకి వచ్చిన అశ్విన్ మంచి సహకారం అందించాడు.
ఈ ఇద్దరి నిలకడతో పవర్‌ప్లేలో 31/2తో ఉన్న స్కోరు ఫస్ట్ టెన్ ఓవర్స్‌లో 58/3గా మారింది. ఇక్కడి నుంచి అశ్విన్ వేగం పెంచాడు. 11వ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో 15 రన్స్ సాధించాడు. తర్వాతి ఓవర్‌లో 4 రన్సే వచ్చినా, 13వ ఓవర్‌లో పరాగ్ సిక్స్‌తో జోరు పెంచాడు. కానీ 14వ ఓవర్‌లో అక్షర్ పటేల్ (1/21) దెబ్బకు అశ్విన్ ఔట్‌కావడంతో నాలుగో వికెట్‌కు 54 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ధ్రువ్ జురెల్ (20)తో కలిసి పరాగ్ బ్యాట్ ఝుళిపించాడు.
15వ ఓవర్‌లో 6, 4, 4 దంచాడు. 16వ ఓవర్‌లో జురెల్ 4, పరాగ్ 4, 6 కొట్టారు. 17వ ఓవర్‌లోనూ జురెల్ 4, పరాగ్ సిక్స్‌తో రెచ్చిపోయారు. ఈ మూడు ఓవర్లలో కలిపి 45 రన్స్ వచ్చాయి. 18వ ఓవర్‌లో ఫోర్ కొట్టిన జురెల్‌ను నోర్జ్ (1/48) పెవిలియన్‌కు పంపాడు. చివర్లో హెట్‌మయర్ (14*) 4, 6 కొడితే 20వ ఓవర్‌లో పరాగ్ 4, 4, 6, 4, 6తో 25 రన్స్ దంచడంతో చివరి 10 ఓవర్లలో 127 రన్స్ వచ్చాయి.