- చెలరేగిన యశస్వి, దేవదత్, హెట్ మయర్
- పంజాబ్ కింగ్స్ ఔట్
ధర్మశాల: ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ జూలు విదిల్చింది. ఛేజింగ్‌లో దేవదత్ పడిక్కల్ (30 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51), యశస్వి జైస్వాల్ (36 బాల్స్‌లో 8 ఫోర్లతో 50), హెట్‌మయర్ (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 187/5 స్కోరు చేసింది. సామ్ కరన్ (31 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 నాటౌట్), జితేష్ శర్మ (28 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), షారూక్ ఖాన్ (23 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41 నాటౌట్) రాణించారు. తర్వాత రాజస్తాన్ 19.4 ఓవర్లలో 189/6 స్కోరు చేసింది. దేవదత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. తాజా విజయంతో 14 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచిన రాయల్స్ నాకౌట్ రేసులోనే ఉంది. ఒకవేళ ఆర్‌సీబీ తన ఆఖరి మ్యాచ్‌లో ఆరు రన్స్ లేదా అంతకంటే ఎక్కువ తేడాతో ఓడితే అప్పుడు రాజస్తాన్‌కు నాకౌట్ బెర్త్ దక్కే చాన్స్ ఉంది.
మిడిల్ అదుర్స్..
పంజాబ్ టాప్ ఆర్డర్ ఫెయిలైనా, మిడిలార్డర్ బాగా ఆడింది. స్టార్టింగ్‌లో రాయల్స్ పేసర్లు బౌల్ట్ (1/35), సైనీ (3/40) స్వింగ్‌తో దెబ్బకొట్టారు. ఇన్నింగ్స్ రెండో బాల్‌కే ప్రభుసిమ్రన్ సింగ్ (2), తర్వాత అతర్వ తైడ్ (19), శిఖర్ ధవన్ (17), లివింగ్‌స్టోన్ (9) వరుస విరామాల్లో వెనుదిరిగారు. దీంతో 50 రన్స్‌కే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కరన్, జితేష్ నిలకడగా ఆడారు. 10వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన జితేష్ స్కోరును 78/4కు పెంచాడు. 13 ఓవర్లలో స్కోరు 100కు చేరింది. 14వ ఓవర్‌లో 4, 6, 4 కొట్టిన జితేష్ ఐదో బాల్‌కు ఔట్‌కావడంతో ఐదో వికెట్‌కు 64 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ టైమ్‌లో షారూక్, కరన్ స్ట్రయిక్ రొటేట్ చేశారు. 19వ ఓవర్‌లో 6, 6, 6, 4తో 28 రన్స్, లాస్ట్ ఓవర్‌లో 4, 6, 4తో 18 రన్స్ దంచారు. లాస్ట్ 6 ఓవర్లలో ఈ ఇద్దరు73 రన్స్ జత చేశారు.
ఆరంభం సూపర్
ఛేజింగ్‌లో యశస్వి, దేవదత్ అదరగొట్టారు. రెండో ఓవర్‌లో బట్లర్ (0) డకౌటైనా, ఈ ఇద్దరు బౌండ్రీల వర్షం కురిపించారు. రబాడ (2/40) బౌలింగ్‌లో రెండు సిక్సర్లతో పడిక్కల్ జోరు పెంచడంతో పవర్‌ప్లేలో రాయల్స్ 57/1 స్కోరు చేసింది. రెండో ఎండ్‌లో జైస్వాల్ కూడా ఫోర్లతో ఆకట్టుకున్నాడు. 10వ ఓవర్‌లో పడిక్కల్ మూడో సిక్స్‌తో 29 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. కానీ ఐదో బాల్‌కు పడిక్కల్ ఔట్‌కావడంతో రెండో వికెట్‌కు 73 రన్స్ పార్ట్‌నర్‌షిప్స్ ముగిసింది. సరిగ్గా ఐదు బాల్స్ తర్వాత శాంసన్ (2) వెనుదిరగడంతో రాయల్స్ స్కోరు 90/3గా మారింది. ఇక్కడి నుంచి హెట్‌మయర్ జోరందుకున్నాడు. వరుస ఓవర్లలో 3 సిక్సర్లు, 4 బాదాడు. మధ్యలో 2 ఫోర్లు కొట్టిన యశస్వి 15వ ఓవర్‌లో వికెట్ ఇచ్చుకున్నాడు. నాలుగో వికెట్‌కు 47 రన్స్ భాగస్వామ్యం బ్రేక్ అయ్యింది. గెలవాలంటే 30 బాల్స్‌లో 47 రన్స్ చేయాల్సిన దశలో రియాన్ పరాగ్ (20) 4, 6, 6, హెట్‌మయర్ 4, 4, 4 కొట్టి ఔటయ్యారు. ఇక లాస్ట్ ఓవర్‌లో 9 రన్స్ కావాల్సి ఉండగా ధ్రువ్ జురెల్ (10 నాటౌట్) సిక్స్‌తో విక్టరీ అందించాడు.