- చెలరేగిన శుభ్‌మన్ గిల్, రషీద్
- శాంసన్, పరాగ్ మెరుపుల వృథా
జైపూర్: ఐపీఎల్–17లో వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న రాజస్తాన్ రాయల్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఆఖరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (44 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77)కు తోడు చివర్లో రషీద్ ఖాన్ (11 బాల్స్‌లో 4 ఫోర్లతో 24*) పోరాటంతో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది.బుధవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై నెగ్గింది. రియాన్ పరాగ్ (48 బాల్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76), కెప్టెన్ సంజూ శాంసన్ (38 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68*) ఫిఫ్టీలతో తొలుత రాజస్తాన్ 20 ఓవర్లలో 196/3 స్కోరు చేసింది. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 199/7 స్కోరు చేసి గెలిచింది. సాయి సుదర్శన్ (35) ఫర్వాలేదనిపించాడు. ఓ వికెట్ కూడా తీసిన రషీద్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
78 బాల్స్‌లో 130 రన్స్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ను ఆరంభంలో జీటీ బౌలర్లు కట్టడి చేశారు. కానీ చివరి 10 ఓవర్లలో పరాగ్, శాంసన్ మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు వచ్చింది. స్టార్టింగ్‌లో ఐదు ఫోర్లు కొట్టిన ఓపెనర్ యశస్వి (24) ఐదో ఓవర్‌లో ఔట్‌కాగా, రెండో ఎండ్‌లో బట్లర్ (8) నిరాశపర్చాడు. దీంతో పవర్‌ప్లేలో రాయల్స్ 43/2 స్కోరు మాత్రమే చేసింది. ఇక్కడి నుంచి శాంసన్, పరాగ్ ఇన్నింగ్స్‌ను ఆదుకునే బాధ్యతను సమర్థంగా నిర్వహించారు. మధ్యలో పరాగ్ 6, 4 కొట్టడంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 30 రన్స్ వచ్చాయి.
ఫలితంగా రాజస్తాన్ 73/2తో ఫస్ట్ టెన్‌ను ముగించింది. ఈ దశలో పరాగ్ ఒక్కసారిగా శివాలెత్తాడు. 4, 6, 6, 6తో 34 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఆ వెంటనే శాంసన్ 4, 4, 4, 6తో రెచ్చిపోయాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్ 134/2 స్కోరుకు చేరింది. 16వ ఓవర్‌లో రషీద్ 5 రన్సే ఇచ్చినా తర్వాతి ఓవర్‌లో శాంసన్ ఫోర్‌తో 31 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అదే జోరులో 4, 6 కొట్టిన పరాగ్ 19వ ఓవర్‌లో ఔటయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 78 బాల్స్‌లోనే 130 రన్స్ జతయ్యాయి. చివర్లో హెట్‌మయర్ (13*) వచ్చీరావడంతో 4, 6 తో బ్యాట్ ఝుళిపించాడు. నాలుగో వికెట్‌కు 8 బాల్స్‌లోనే 24 రన్స్ జోడించడంతో రాయల్స్ భారీ టార్గెట్ నిర్దేశించింది.
గెలిపించిన రషీద్, తెవాటియా
ఛేజింగ్‌లో ఓపెనర్ సాయి సుదర్శన్ స్టార్టింగ్‌లోనే 4, 6తో టచ్‌లోకి రాగా, గిల్ కూడా సిక్సర్‌తో జోరు పెంచాడు. మధ్యలో సింగిల్స్‌కు తోడు ఆరో ఓవర్‌లో గిల్ 4, 6తో పవర్‌ప్లేలో జీటీ 44/0 స్కోరుతో మంచి స్థితిలో నిలిచింది. అప్పటికే అశ్విన్‌ను దించిన శాంసన్.. రెండో ఎండ్ నుంచి చహల్ (2/43)ను తీసుకొచ్చాడు. 8వ ఓవర్‌లో చహల్‌కు సాయి రెండు ఫోర్లతో స్వాగతం పలికాడు. కానీ ఇక్కడి నుంచి కుల్దీప్ సేన్ (3/41) మ్యాచ్‌ను టర్న్ చేశాడు.
9వ ఓవర్‌లో సాయిని ఔట్ చేసి తొలి వికెట్‌కు 64 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేసిన అతను 11వ ఓవర్‌లో నాలుగు బాల్స్ తేడాలో మాథ్యూ వేడ్ (4), మనోహర్ (1)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో 10వ ఓవర్లలో 76/1గా ఉన్న స్కోరు 79/3గా మారింది. గిల్‌కు తోడైన విజయ్ శంకర్ (16) ను 14వ ఓవర్‌లో చహల్ ఔట్ చేశాడు. 35 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన గిల్ నాలుగు ఫోర్లు కొట్టి 16వ ఓవర్‌లో చహల్‌కే వికెట్ ఇచ్చాడు.
133/5తో కష్టాల్లో పడ్డ గుజరాత్‌ను గెలిపించే బాధ్యత రాహుల్ తెవాటియా (22), షారూక్ ఖాన్ (14)పై పడింది. అశ్విన్ బౌలింగ్‌లో 6, 4, 4తో 17 రన్స్ రాబట్టిన షారూక్ 18వ ఓవర్‌లో ఔటయ్యాడు. ఇక 12 బాల్స్‌లో 35 రన్స్ కావాల్సిన టైమ్‌లో తెవాటియా 4, 4, రషీద్ 4తో 20 రన్స్ దంచారు. చివరి ఓవర్లో15 రన్స్ కోసం రషీద్ 4, 2, 4, 1 కొట్టినా తెవాటియా రనౌట్ కావడంతో ఉత్కంఠ మొదలైంది. లాస్ట్ బాల్‌కు 2 రన్స్ అవసరం కాగా రషీద్ ఫోర్‌తో గుజరాత్‌కు విజయాన్ని అందించాడు.