CSK vs RR: నితీష్ రాణా విధ్వంసకర ఇన్నింగ్స్.. చెన్నై ముందు బిగ్ టార్గెట్

CSK vs RR: నితీష్ రాణా విధ్వంసకర ఇన్నింగ్స్.. చెన్నై ముందు బిగ్ టార్గెట్

ఐపీఎల్ సీజన్ 18 లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ కాస్త గాడిలో పడినట్టుగానే కనిపిస్తుంది. ఆదివారం (మార్చి 30) గౌహతి వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. నితీష్ రాణా(36 బంతుల్లో 81: 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ కు తోడు కెప్టెన్ పరాగ్(37) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి 15 ఓవర్లలో 145 పరుగులు చేసిన రాజస్థాన్ చివరి ఐదు ఓవర్లలో కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ కు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. తొలి బంతిని ఫోర్ కొట్టిన జైశ్వాల్ మూడో బంతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో సంజు శాంసన్ కు జత కలిసిన నితీష్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పవర్ ప్లే లోనే పెను విధ్వంసం సృష్టించాడు. ఓ ఎండ్ లో రాణా బౌండరీల వర్షం కురిపిస్తుంటే మరో ఎండ్ లో సంజు శాంసన్ చక్కని సహకారం అందించాడు. వీరిద్దరి ధాటికి తొలి మూడు ఓవర్లలో 29 పరుగులు చేసిన రాజస్థాన్ తర్వాత మూడు ఓవర్లలో ఏకంగా 50 పరుగులు రాబట్టింది. పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది.  

ఈ క్రమంలో నితీష్ రాణా 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్ ప్లే తర్వాత సంజు శాంసన్ (20) ఔటైనా.. రాణా తన విధ్వంసాన్ని కొనసాగించాడు. ప్రమాదకరంగా మారుతున్న నితీష్ అశ్విన్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. ఇక్కడ నుంచి రాజస్థాన్ పరుగుల వేగం తగ్గింది. ధృవ్ జురెల్ (3), హసారంగా (4) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 37 పరుగులు చేసి పరాగ్ రాణించగా.. చివర్లో హెట్ మేయర్ 19 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, పతిరానా, ఖలీల్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.