- రాణించిన సందీప్, బట్లర్, శాంసన్
జైపూర్: ఐపీఎల్–17లో రాజస్తాన్ రాయల్స్ టాప్ ఫామ్‌తో దూసుకుపోతోంది. ఛేజింగ్‌లో యశస్వి జైస్వాల్ (60 బాల్స్‌లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 104 నాటౌట్) సెంచరీతో దుమ్మురేపడంతో.. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. టాస్ నెగ్గిన ముంబై తొలుత 20 ఓవర్లలో 179/9 స్కోరు చేసింది. తిలక్ వర్మ (45 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65), నేహల్ వాధెరా (24 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు.
ఇన్నింగ్స్ ఐదో బాల్‌కు రోహిత్ (6) ఔట్‌కాగా, 2, 4వ ఓవర్లలో సందీప్ (5/18) వరుసగా ఇషాన్ (0), సూర్య కుమార్ (10)ను పెవిలియన్‌కు పంపాడు. 8వ ఓవర్లో చహల్ (1/48).. మహ్మద్ నబీ (23)ని ఔట్ చేయడంతో సగం ఓవర్లకు ముంబై 72/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో తిలక్ వర్మ, నేహల్ వాధెరా భారీ హిట్టింగ్‌తో ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 99 రన్స్ జోడించడంతో ముంబై ఇన్నింగ్స్ కాస్త తేరుకుంది. కానీ చివర్లో హార్దిక్ పాండ్యా (10), గెరాల్డ్ కోయెట్జీ (0), టిమ్ డేవిడ్ (3) నిరాశపర్చడంతో ముంబై తక్కువ స్కోరుకే పరిమితమైంది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 18.4 ఓవర్లలోనే 183/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్లు జైస్వాల్, బట్లర్ (35) దూకుడుతో పవర్‌ప్లేలో 61/0 స్కోరు చేసిన రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు మధ్యలో వర్షం అంతరాయం కలిగించింది. 8వ ఓవర్లో బట్లర్ ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 74 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో వచ్చిన శాంసన్ (38 నాటౌట్) నిలకడగా ఆడగా, జైస్వాల్ భారీ షాట్లతో చెలరేగాడు.
31 బాల్స్‌లో ఫిఫ్టీ, 59 బాల్స్‌లో సెంచరీ చేసిన జైస్వాల్ రెండో వికెట్‌కు శాంసన్‌తో 109 రన్స్ జోడించి ఈజీగా విజయాన్ని అందించాడు. సందీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చహల్ రికార్డులకెక్కాడు. డ్వేన్ బ్రావో (183), చావ్లా (181) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.