
ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ గాడిలో పడింది. శనివారం (ఏప్రిల్ 5) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో జైశ్వాల్ (45 బంతుల్లో 67: 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి తోడు బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.
206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు తొలి ఓవర్ లోనే జోఫ్రా ఆర్చర్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. తొలి బంతికే ప్రియాంష్ ఆర్యను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ అయ్యర్ రెండు ఫోర్లు కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. అయితే చివరి బంతికి రిస్కీ షాట్ కు ప్రయత్నించి బౌల్డయ్యాడు. దీంతో 11 పరుగులకే 2 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న స్టోయినీస్ కూడా ఒక పరుగుకే పెవిలియన్ కు చేరాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 17 పరుగులు చేసి ఒత్తిడిలో ఔటయ్యాడు.
►ALSO READ | RR vs PBKS: ఔటయ్యాడనే అసహనం.. కోపంతో గ్రౌండ్‌లోనే బ్యాట్ విసిరేసిన శాంసన్
43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ పని అయిపోయిందనుకున్నారు. ఈ దశలో నేహాల్ వధేరా (62), గ్లెన్ మ్యాక్స్ వెల్ (30) అసాధారణంగా పోరాడారు. మొదట్లో ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఒక్కసారిగా బ్యాట్ ఝులిపించారు. ఐదో వికెట్ కు 52 బంతుల్లోనే 88 పరుగులు జోడించి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా రాజస్థాన్ చేతుల్లోకి వెళ్ళింది. చివర్లో కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో పంజాబ్ చివర్లో చేతులెత్తేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ, తీక్షణ రెండు వికెట్లు తీశారు. హసరంగా, కార్తికేయలకు తలో వికెట్ లభించింది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వీ జైశ్వాల్ పంజాబ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 67 పరుగులు చేశాడు. చివర్లో రియాన్ పరాగ్ (43 నాటౌట్), హెట్మేయర్ (20), దృవ్ జురెల్ (13 నాటౌట్) రాణించారు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 2, మార్కో జాన్సెన్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీశారు.
Rajasthan Royals keep it simple and sharp in a comfortable win on the road ✅
— ESPNcricinfo (@ESPNcricinfo) April 5, 2025
Scorecard: https://t.co/IvwL3fRIi7 #PBKSvRR #IPL2025 pic.twitter.com/Pg4LxA3HH4