CSK vs RR: రాజస్థాన్ రాయల్స్ బోణీ.. ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన చెన్నై

CSK vs RR: రాజస్థాన్ రాయల్స్ బోణీ.. ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన చెన్నై

ఐపీఎల్ సీజన్ 18లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. గౌహతి వేదికగా ఆదివారం (మార్చి 30) చెన్నై సూపర్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో గైక్వాడ్ (63) పోరాడినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులకు పరిమితమైంది.         

183 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించలేదు. జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్ నాలుగో బంతికే  రచీన్ రవీంద్రను డకౌట్ చేశాడు. పవర్ ప్లే లో రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పవర్ ప్లే లో కేవలం 44 పరుగులు మాత్రమే రాబట్టింది. త్రిపాఠి (23) నాలుగు బౌండరీలు కొట్టి టచ్ లో కనిపించినా పవర్ ప్లే తర్వాత బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

దూబే కూడా రెండు సిక్సర్లతో అలరించినా అంతలోపు ఔటయ్యాడు. 19 పరుగుగు చేసి. పరాగ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు ఔటయ్యాడు. ఆ ఆతర్వాత విజయ్ శంకర్ 9 పరుగులే చేసి ఒత్తిడిలో వికెట్ సమర్పించుకున్నాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా.. చెన్నై కెప్టెన్ గైక్వాడ్ మాత్రం అసాధారణంగా పోరాడాడు. జడేజాతో కలిసి 37 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మ్యాచ్ నువ్వా నేనా అని సాగుతున్న సమయంలో హసరంగా బౌలింగ్ గైక్వాడ్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మళ్లింది. చివర్లో ధోనీ (16), జడేజా (32) ఉన్నప్పటికీ సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో చెన్నై విజయం అంచుల వరకు వచ్చి ఆగిపోయింది. 

ALSO READ | CSK vs RR: ఇది మామూలు స్టన్నర్ కాదు.. పరాగ్ గేమ్ ఛేంజింగ్ క్యాచ్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. నితీష్ రాణా(36 బంతుల్లో 81: 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ కు తోడు కెప్టెన్ పరాగ్ (37) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి 15 ఓవర్లలో 145 పరుగులు చేసిన రాజస్థాన్ చివరి ఐదు ఓవర్లలో కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది.  చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, పతిరానా, ఖలీల్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. రాజస్థా రాయల్స్ బౌలర్లలో హసరంగా 4 వికెట్లు తీసుకోగా.. ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.