RR vs RCB:బట్లర్ విధ్వంసకర సెంచరీ.. భారీ స్కోర్ చేసి ఓడిన బెంగళూరు

RR vs RCB:బట్లర్ విధ్వంసకర సెంచరీ.. భారీ స్కోర్ చేసి ఓడిన బెంగళూరు

ఐపీఎల్ లో బెంగళూరుకు మరో ఓటమి. భారీ స్కోర్ చేసినా ఎప్పటిలాగే బౌలర్లు విఫలం కావడంతో ఘోరంగా ఓడిపోయింది. 184 పరుగుల ఛేజింగ్ లో బట్లర్ (58బంతుల్లో 100,9 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీకి తోడు సంజు శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేస్తే.. ఛేజింగ్ లో ఆర్సీబీ మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఈ టోర్నీలో రాజస్థాన్ కు ఇది వరుసగా నాలుగో విజయం కాగా.. ఐదు మ్యాచ్ లాడిన బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి. 

భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కు తొలి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో బంతికే డకౌటయ్యాడు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో తొలి 5 ఓవర్లో కేవలం 34 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే  దగర్ వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో ఏకంగా 20 పరుగులు రాబట్టడంతో రాజస్థాన్ మ్యాచ్ లోకి వచ్చింది. శాంసన్, బట్లర్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. రెండో వికెట్ కు వీరిద్దరూ 14 ఓవర్లలోనే 148 పరుగులు నెలకొల్పడంతో మ్యాచ్ పూర్తిగా రాజస్థాన్ చేతులోకి వచ్చింది. 

శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. బట్లర్ 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో టాప్లీ, యష్ దయాళ్, సిరాజ్ లకు తలో వికెట్ లభించింది. అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ (72 బంతుల్లో 113,12 ఫోర్లు, 4 సిక్సులు) ఒక్కడే వారియర్ లా పోరాడి ఈ సీజన్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ 44 పరుగులు చేసి రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. బర్గర్ కు ఒక వికెట్ దక్కింది.